చందంపేట(దేవరకొండ), డిసెంబర్ 20 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో శుక్రవారం ఆచప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్‌ను పెంచేందుకు ఫార్ములా -ఈ రేస్‌ను నిర్వహించిందని గుర్తు చేశారు.
ఫార్ములా-ఈ రేస్‌తో తెలంగాణ రాష్ర్టానికి రూ.700 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరువు తీసేలా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్న సమయంలో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని చెప్పారు. అక్రమ కేసులు బనాయించిన రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. లగచర్ల ఘటనతో అక్రమ కేసులో అరెస్టు అయిన వారికి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా మిగిలిన రైతులకు న్యాయం జరిగిందని తెలిపారు.
ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, సీనియర్ నాయకులు గాజుల ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, పల్లా లోహిత్‌రెడ్డి, ఉమేందర్కుమార్, తులసీరాం, ఖాదర్‌బాబా, అప్రోజ్, తరి గోవర్ధన్, గుండాల వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.