నల్లగొండ, జూన్ 23: అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెబితే అదే వన్‌సైడ్‌గా అమలు చేస్తున్నారని, వారు పరిధి దాటి ప్రవర్తించడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ మండలంలోని పలు సమస్యలపై ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని సోమవారం కలవటానికి రాగా, ఆమె తన చాంబర్లో నిరాకరించారు. దీంతో ఆయన నేరుగా గ్రీవెన్స్ హాల్లోకి వెళ్లి కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు.
నకిరేకల్ శాసన సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యానని, నిత్యం ప్రజలతో సంబంధాలు ఉన్న తాను సమస్యలపై విన్నవించడానికి 26సార్లు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వకపోవడం సరికాదని అనటంతో పాలీసులు ఆయనను హాల్ నుంచి బయటకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్‌కు నకిరేకల్ సమస్యలు విన్నవించటానికి 26సార్లు ఫోన్ చేసినా ఎత్తి సమాధానం ఇవ్వకపోవటం వల్లనే నేరుగా వచ్చానని, అయినా రెస్పాండ్ కాకపోవటం ఎంటని ప్రశ్నించారు.
నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ వాణిశ్రీనుల అర్జీలను కలెక్టర్ పట్టించుకోకుండా దాటవేస్తూ..స్థానిక ఎమ్మెల్యే వత్తిడితో వారిని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు అధికారులు తప్పుడు నివేదికలు క్రియేట్ చేసి, ఇటీవల కేతెపల్లి పంచాయతీ కార్యదర్శిపై వేటు వేశారన్నారు. బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ నేతలు అధికారుల అండదండలతో చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలో భవనాలను నేలమట్టం చేయించినట్లు తెలిపారు.
అధికారులు ఎమ్మెల్యేల తొత్తులుగా మారీ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పెద్ద హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇవ్వాల కాంగ్రేసోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల దగ్గర పవర్ లేకుండా పోయిందని మొత్తం పవర్‌ను కాంగ్రెస్ నేతలే తీసుకొని నిడిపిస్తున్నారన్న చిరుమర్తి కలెక్టరేట్ దగ్గర ఉన్న బాధితులను చూస్తే రాష్ట్రంలో రేవంత్ పాలన ఎట్లా ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని..ఫైరవీలు, లంచాలతో నాయకులు, అధికారులు పబ్బం గడుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని..అధికారులు పరిధి దాటి పనిచేస్తే సహించమని హెచ్చరించారు.