హాలియా, సెప్టెంబర్ 28 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తున్నదని, పది నెలల తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా డ్రామా ఆడుతున్నారని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. బఫర్ జోన్లో ఉన్న ముఖ్యమంత్రి సొంత సోదరుడి ఇంటిని కూల్చివేయకుండా నోటీసులతో సరిపెట్టిన హైడ్రా పేదల ఇండ్లను ఎందుకు కూలదోస్తున్నదని ప్రశ్నించారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోనికి వచ్చి 300 రోజులైనా అమలు చేయలేకపోయారని విమర్శించారు. ఆ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఫ్లోరోసిస్ సమస్యపై జిల్లా మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోయి లేకుండా రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ వేదికగా మిషన్ భగీరధ వల్ల నల్లగొండ జిల్లా గడ్డ నుంచి ఫ్లోరోసిస్ భూతం పూర్తిగా పొయ్యిందని చెప్పిందని వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు మంత్రి అయ్యాక ఎస్ఎల్బీసీని త్వరిగతిన పూర్తి చేసి నల్లగొండ జిల్లా నుంచి ఫ్లోరోసిస్‌ను తరిమివేస్తాననడం హాస్యస్పదంగా ఉందన్నారు. సాగర్ నియోజకవర్గంలోని 24వేల ఎకరాల టేలెండ్ భూములకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నెల్లికల్లు లిప్ట్కు నిధులు మంజూరు చేస్తే.. మాజీ మంత్రి జానారెడ్డి మాత్రం 6వేల ఎకరాలకే నెల్లికల్లు లిప్ట్ ద్వారా నీళ్లు అందిస్తామనడం విడ్డూరంగా ఉన్నారు. దీనిపై జిల్లా మంత్రి కోమటిరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టత ఇవ్వడం లేదన్నారు.
సాగర్ డ్యామ్ నుంచి 200 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలైనా.. పక్కనే ఉన్న చెరువులను మాత్రం నింపరని ఎద్దేవా చేశారు. గత ఎన్నికలకు ముందే డీ 8, 9 కెనాల్ పనులు పూర్తయినా నేటికి ఎందుకు సాగునీరు ఇవ్వడం లేదని నిలదీశారు. ఆగస్టు 15లోపుగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానన్న రేవంత్ సర్కారు అక్టోబర్‌కు వస్తున్నా సగం మందికి మాఫీ చేయలేదన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసినా రైతు భరోసా నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు.