మిర్యాలగూడ, ఫిబ్రవరి 11: అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తామని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 29వ వార్డులో పోలింగ్ సమయం ముగిసిన తరువాత మిత్రపక్షాల అభ్యర్థికి చెందిన ఏజెంట్లు మస్తాన్, జమీల్, చాంద్‌పాషాపై కాంగ్రెస్ అభ్యర్థి జావిద్, ఆయన అనుచరులు కర్రలు, రాడ్లతో దాడులకు దిగడం దారుణమని, ఈ దాడులపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. గత 40 ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా మూకుమ్మడి దాడులకు పాల్పడ్డారన్నారు. ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను హతమర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ గూండాలు మరో సారి వచ్చి మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారన్నారు.
పరామర్శకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిపై దాడికి యత్నించారని, విషయం తెలిసి దవాఖానకు వెళ్లిన బీఆర్ఎస్ యువ నాయకుడు నల్లమోతు సిద్ధార్థపై జావిద్, ఆయన అనుచరులు 50 మందికి పైగా దాడులకు పాల్పడ్డారని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ నాయకులు ఇది గుర్తుంచుకోవాలని వారు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో ఏరోజు ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడలేదన్నారు. మరో రెండున్నరేండ్ల తరువాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యమని, ఇప్పుడు దాడి చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన జావిద్, ఆయన అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త ఆధ్వర్యంలో దొంగ ఓట్లు వేయించారని, దీనిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నందుకు పోలీసుల సమక్షంలోనే వారిపై దాడులకు పాల్పడ్డారని, ఈ వార్డులో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిద్ధార్థ, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, హతీరాం, ఎండీ మోసిన్‌అలీ, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పాలుట్ల బాబయ్య, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, పోకల రాజు తదితరులు ఉన్నారు.