నల్లగొండ, జూలై 14 : ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని, వాటిని అమలు చేసే సత్తా లేక ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తుందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేటి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పర్యటన నేపథ్యంలో నిన్న అర్థరాత్రి నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తూ స్టేషన్లకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ను సైతం హైదరాబాద్‌లోని హబ్సీగూడలో గల ఆయన నివాసంలో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఇది ప్రజా పాలనా లేక అరెస్టుల పాలనా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలు విడుదల చేయకపోవడం, రైతు భరోసా అందక, రుణమాఫీ కాక, ఎరువులను సకాలంలో సరఫరా చేయకుండా రైతులన్నలను అరిగోస పెడుతున్న రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని తుంగతుర్తికి వస్తున్నాడన్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలు గురించి ప్రజల పక్షాన పోరాటం చేస్తే అక్రమ కేసులు పెడుతున్నరని దుయ్యబట్టారు. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ నాయకులు అదిరేది లేదు, బెదిరేది లేదన్నారు.
తమకు పోరాటాలు, ఉద్యమాలు, కేసులు, జైళ్లు, అరెస్టులు కొత్త కావన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను, ప్రజల గొంతుకను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తిలోని ప్రతి గ్రామంలో రాజకీయ గొడవలు సృష్టించి కక్ష్యలు, కార్పణ్యాలు రెచ్చగొడుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో శాంతియుతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు రేపుతున్నారన్నారు. పొలాలు ఎండిపోతున్నాయి గోదావరి నీళ్లు ఇవ్వండి అంటే, కాంగ్రెస్‌లో చలనమే లేదని పేర్కొన్నారు.
Nalgonda : హామీలు అమలు చేసే సత్తా లేక, హౌస్ అరెస్టులా? : మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్