గుండాల, ఏప్రిల్ 21 : ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గుండాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం బీఆర్ఎస్ రజోత్సవ సభ విజయవంతానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, ఎత్తిన నినాదాన్ని నిజం చేసి చూపిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని అన్నారు. గులాబీ జెండాను ప్రతి గుండె దగ్గర చేసిన నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీనే ప్రజలకు శ్రీరామ రక్ష అని తెలిపారు. పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగంగా సాగిందని, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగునీరు, ప్రాజెక్టుల నిర్మాణం, ఐటీ కంపెనీలు వంటి ఏర్పాటుతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ నంబర్ వన్‌గా తీర్చి దిద్దారని అన్నారు.
అంతటి ఘనకీర్తి కలిగిన రాష్ర్టాన్ని నేటి కాంగ్రెస్ పాలనలో భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎండీ ఖలీల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందడి రామకృష్ణారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పొన్నగాని మహేశ్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు కొమ్మగళ్ల దయాకర్, యువజన విభాగం అధ్యక్షుడు అట్ల రంజిత్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బొమ్మిరెడ్డి మల్లారెడ్డి, నాయకులు బబ్బూరి సుధాకర్, కోలుకొండ రాములు, మచ్చ చెన్నారెడ్డి, వంగాల మల్లేశ్, అండెం మమత, జటంగి రాజు, మాదరబోయిన శ్రీనివాస్, గిరికత్తుల శ్రీనివాస్, వీరమల్ల సోమన్న, కొండబోయిన పరశురాములు, అనంతుల శేఖర్, సంగి బాలకృష్ణ, గడ్డమీది మహోదయ్, కాసం నగేశ్, యెగమాటి వేణుగోపాల్‌రెడ్డి, వంగూరి అనిల్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వడానికే ఎల్కతుర్తి సభ
ఎల్కతుర్తి సభ ద్వారా కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. పంటలు ఎండిపోయి రైతులు, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రతి గడపకు పథకాలు అందాయి. 10 సంవత్సరాల కాలంలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. సన్నబియ్యం ఇస్తున్నామంటూ కాంగ్రెస్ నాయకులు ఇండ్లల్లో భోజనం చేస్తున్నారు. వారికి దమ్ముంటే రుణమాఫీ, రైతు భరోసా రాని రైతులు, మహాలక్ష్మి పథకం ఇవ్వని ఆడబిడ్డల ఇండ్లల్లో కూడా భోజనానికి వెళ్లాలి.
-బూడిద భిక్షమయ్య గౌడ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పాలనలో బాధపడుతున్న జనం
దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధిని కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేసి చూపించారు. కేసీఆర్‌ను వద్దనుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడుతాడో అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మాయ మాటలతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టులేక పోయింది. ప్రజలు మంచి ఏదో, చెడు ఏదో అని అన్ని గమనిస్తున్నారు. రుణమాఫీ అని సగం మందికి కూడా చేయకుండా వదిలేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. బీఆర్ఎస్ హయాంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ జలాశయాలను నిర్మించడం వల్లే ఆలేరుకు సాగునీళ్లు వస్తున్నాయి. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపే దమ్ము ఎవరికీ లేదు.
-గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్