రాజాపేట, జూన్ 7 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతుపై వానపడ్డ చందంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విమర్శించారు. రైతు సమస్యల పరిషారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చెప్పేది కొండంత, చేసేది గోరంత అని అన్నారు. ఆదివారం రాజాపేట మండలం రేణికుంటలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంతో ఆర్భాటంగా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ కాంటాలు పెట్టకపోవడం, సిబ్బంది కొరత, ధాన్యం తరలింపులో జాప్యం తదితర సమస్యలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. వాన కాలం సమీపిస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ఇంకా సగం ధాన్యం ఉందని, రైతులు పంటలను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలులో అధికారులు అనేక నిబంధనలు, కొర్రీలు పెడుతున్నారన్నారు. అదనంగా ప్రతి బస్తాకు రెండు నుంచి ఐదు కిలోల వరకు తూకం వేయించి రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల పంటలకు సరైన ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు రైతు సమస్యలపై శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు.
కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవని, రైతులే అద్దెకు తెచ్చుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. రైతు సమస్యల పరిషారంపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్, మండల మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, మదర్ డైయిరీ డైరెక్టర్లు సందిల భాసర్ గౌడ్, చింతలపూరి వెంకటరామిరెడ్డి, సర్పంచ్లు పల్లె సంతోష్ గౌడ్, గుంటి మధుసూదన్ రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు, బెడిదె వీరేశం సోమలింగం గుప్తా, ఉప్పలయ్య గౌడ్, గజ్జల రాజు, రామచంద్రారెడ్డి ఉన్నారు.