తిరుమలగిరి, మే 10 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలగిరి శుభమస్తు ఫంక్షన్ హాల్ నుంచి పాత గ్రామంలోని గాంధీనగర్ వరకు ఆరు కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ప్రచార రథం నుంచి ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు.
అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం తిరిగి పట్టాలెక్కాలన్నా, రైతులు సుభిక్షంగా ఉండాలన్నా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.
కరువు ప్రాంతమైన తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 46 వేల ఎకరాలు మాత్రమే సాగైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాల్వ ద్వారా సాగునీరు అందించడంతో లక్షా 46 వేల ఎకరాలు సాగులోకి వచ్చినట్లు తెలిపారు.
నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కోమటి రెడ్డి బ్రదర్స్ నియోజకవర్గానికి చేసింది శూన్యమన్నారు. మచ్చలేని వ్యక్తి క్యామ మల్లేశ్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, పార్టీ మండలాధ్యక్షుడు రఘనందన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.