కట్టంగూర్, అక్టోబర్ 19 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ భేసరతుగా రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. షరుతుల్లేని రుణమాఫీ కోసం శనివారం కట్టంగూర్‌లో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్గూశరం ఉంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నారు.
రుణమాఫీపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితోపాటు మంత్రులు పొంతన లేని ప్రకటనలు చేస్తూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. అడ్డగోలు షరతుల కారణంగా వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. సాగునీటి విడుదల, రూ.500 బోనస్, రైతు భరోసా, రుణమాఫీ, కొత్త రుణాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండి చెయ్యి చూపిందని మండిపడ్డారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతుల అవసరాలు తెలుసుకుని వారు అడగకుండానే రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా ఇచ్చి దేశానికే అన్నపెట్టే అన్నపూర్ణ తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగు నీరందించారని తెలిపారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో పేదోళ్ల ఇండ్లను కూడగొట్టిన రేవంత్‌రెడ్డికి వారి ఉసురు తాకుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, అయినా భయపడే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా, రూ.500 బోనస్ ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు. అనంతరం తాసీల్దార్ గుగులోతు ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు వడ్డె సైదిరెడ్డి, గుర్రం సైదులు, పనస సైదులు, దాసరి సంజయ్‌కుమార్, పిన్నపురెడ్డి సైదిరెడ్డి, బెల్లి సుధాకర్, జానీపాషా, నాయకులు పెద్ది బాలనర్సయ్య, అంతటి శ్రీను, గాజుల బుచ్చమ్మ, పాదూరి శిశుపాల్‌రెడ్డి, చౌగోని జనార్దన్, చీర రవి, రెడ్డిపల్లి మనోహర్, నకిరేకంటి నర్సింహ, ఎర్రమాద నర్సిరెడ్డి, చెరుకు నర్సింహ, వడ్డె సైదిరెడ్డి, మంగదుడ్ల వెంకన్న, శ్రీపాద రామకృష్ణ, మేకల రమేశ్, పోతరాజు నగేశ్, మల్లేశ్, శ్రీను పాల్గొన్నారు.