చిట్యాల, జనవరి 25 : మండలంలోని వనిపాకల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడి ఘటనలో దాడి చేసిన వారిపై కాకుండా ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం చిట్యాల పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిరసన తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ వారు దాడి చేసిన ఘటనలో బాధితుడు చావుబతుకుల మధ్య ఉంటే దాడి చేసిన వారితో పాటు బాధితుడిపై కూడా కేసు ఎలా పెడుతారని సీఐని ప్రశ్నించారు. నకిరేకల్ సీఐ రాజశేఖర్, చిట్యాల ఎస్ఐ ఎన్. ధర్మతో కొద్ది సేపు వాగ్వాదం జరిగిన తరువాత బయటకు వచ్చి స్టేషన్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బాధితుడిపై కేసును ఎత్తేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లనని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ నెల 23న రాత్రి ఘటన జరిగితే శనివారం ఉదయం దాడి చేసిన వారు దొంగ కట్లు కట్టించుకొని వచ్చి తమపై కూడా దాడి చేశారని నాటకాలు అడతున్నారని ఆరోపించారు. పోలీసులు నమ్మి దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేయటం అన్యాయమన్నారు.
ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయక పోవడమేంటని ప్రశ్నించారు. అనంతరం ఎస్ఐ నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డితో చిరుమర్తికి ఫోన్లో మాట్లాడించగా.. ఇరువర్గాలపై కాకుండా దాడి చేసిన వారిపైనే కేసు నమోదు చేయాలని చిరుమర్తి డిమాండ్ చేశారు. అందుకు డీఎస్పీ విచారణ అనంతరం చట్ట ప్రకారం కేసులు చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. ఆయన వెంట మెండె సైదులు, కొలను వెంకటేశం, సుంకరి యాదగిరి, పొన్నం లక్ష్మయ్య, బాలగోని రాజు, జిట్ట బొందయ్య, ఆగు అశోక్, కందాటి అశోక్‌రెడ్డి, కొలను సతీశ్, చిత్రగంటి ప్రవీణ్, జిట్ట శేఖర్, శ్రీశైలం, మోకిడి వినయ్, నర్రా శ్రీకాంత్‌రెడ్డి, దగ్గుల సైదులు, బొలుగూరి సైదులు పాల్గొన్నారు.