నకిరేకల్, డిసెంబర్ 11 : ఇందిరమ్మ రాజ్యమొస్తే మహిళలను అన్ని రంగాల్లో అందలం ఎక్కిస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ తల్లులపై కాంగ్రెస్ పాలకులు మగ పోలీసులతో దాడులు చేయిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఓ వైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తూనే మరో వైపు ఆశ వర్కర్లపై కర్కశత్వం చూపించిన తీరు కాంగ్రెస్ ప్రజాపాలనకు అద్దం పడుతుందని పేర్కొన్నారు.
నకిరేకల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతనాలు పెంచాలని వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆశ వర్కర్లపై క్రూరంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. తెలంగాణ తల్లి ఆడబిడ్డలకు ప్రతిరూపమని అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. బయట వారిపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆశ కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, వారికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశ వర్కర్లకు గౌరవ వేతనం రూ.1500 ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తామని ప్రగల్భాలు పలికి వారిని నడిరోడ్డులో ఈడ్చికొట్టడం యావత్ తెలంగాణ మహిళా లోకం గమనిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పాలనకు మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలువేరు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, కౌన్సిలర్ పల్లె విజయ్, మాజీ సర్పంచులు చెట్టుపల్లి జానయ్య, వడ్డె సైదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుర్రం గణేశ్, నాయకులు లింగారెడ్డి, కృష్ణకాంత్ పాల్గొన్నారు.