నకిరేకల్, ఏప్రిల్ 3 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని, అడ్డుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులపై దాడులు, అరెస్టులు చేస్తూ క్రూరంగా వ్యవహరిస్తూ విధ్వంసకాండను సృష్టిస్తున్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నాడు విద్యుత్ చార్జీలు తగ్గించాలని న్యాయపోరాటానికి దిగిన విద్యార్థులు, రైతులపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపించారని..
తమ సమస్యల పరిష్కారానికి వచ్చిన అంగన్వాడీలపై గుర్రాలతో తొక్కించారని.. అదే ధోరణిలో సీఎం రేవంత్‌రెడ్డి హెచ్‌సీయూ విద్యార్థులపై లాఠీలు ఝుళిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ ఉద్యమిస్తున్న హెచ్‌సీయూ విద్యార్థులు, అధ్యాపకులపై సర్కారు గూండాగిరీ ప్రదర్శిస్తున్నదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
ఇందిరమ్మ పాలన అంటూ అధికారం చేపట్టి బుల్డోజర్ రాజ్యం నడుపడమేంటని ప్రశ్నించారు. భూములను అమ్మి ఆదాయం పెంచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను కాజేస్తున్నదని విమర్శించారు. పదేండ్ల పాటు అధికారంలోనున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ 400 ఎకరాలు హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములని, అందులో అరుదైన జంతు, వృక్ష జాతులు నివసిస్తున్నాయన్న కారణంతోనే వాటిని కాపాడిందని తెలిపారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇండ్లను, హెచ్‌సీయూలో పక్షులు, జంతువులను రేవంత్సర్కార్ వదిలిపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్‌సీయూ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్రెడ్డ మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకట్‌గౌడ్, నాయకులు సామ శ్రీనివాస్‌రెడ్డి, గొర్ల వీరయ్య, దైద పరమేశం, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, రాచకొండ శ్రవణ్, యానాల లింగారెడ్డి, కౌన్సిలర్ పల్లె విజయ్, చెట్టుపల్లి జానయ్య, గుండగోని జంగయ్య పాల్గొన్నారు.