నార్కట్‌పల్లి, మార్చి 19 : రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, వ్యవసాయం సంక్షోభంగా మారిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని నెమ్మాని, జువ్విగూడెం, చిన్నతుమ్మలగూడెం గ్రామాల్లో బుధవారం ఆయన ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పశువులకు మేతలా మారిందని, మోటార్లు కాలిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు చిరుమర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆయనతో కన్నీరు మున్నీరై తమ బాధలు విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పంట పొలాలు ఎండిపోయాయని, రైతులు ధైర్యం కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు అవగాహన రాహిత్యంతో చేతికొచ్చిన పాలాలు ఎండిపోయాయని మండిపడ్డారు. ఎకరానికి దాదాపు రూ.35,000 ఖర్చు చేసిన రైతుకు పంటలు ఎండాయని, పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 50వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సాగర్ నుంచి నీళ్లు ఆంధ్రాకు తరలించకుండా తెలంగాణ రైతాంగానికి అందించాలని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించి తామే చేశామని గొప్పలు పలుకడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నార్కట్‌పల్లి మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, రైతు బంధు సమితి మాజీ మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు మేకల రాజిరెడ్డి, చిరుమర్తి యాదయ్య, దుబ్బాక శ్రీధర్, మాజీ సర్పంచ్‌లు బొక్క భూపాల్ రెడ్డి, కొత్త నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు బత్తుల అనంతరెడ్డి, బురుగె ఎల్లేశ్, కృష్ణ, భిక్షం, వెంకటయ్య, సైదులు, నిఖిల్, ప్రతాప్‌రెడ్డి, యాదయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఫకీర్ సత్తిరెడ్డి ఉన్నారు.