రామన్నపేట, మార్చి 29 : పదిహేను నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుంటిసాకులతో కాలయాపన చేస్తున్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండల కేంద్రంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ అంటూ 60 శాతం మందికి చెయ్యలేదని మండిపడ్డారు. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సంక్రాతి పండుగకు హామీలు అమలు చేస్తామన్న ప్రభుత్వం ఉగాదికి వచ్చినా చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలుగు నూతన సంవత్సరంలోనైనా హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మండలంలోని నిర్నెంముల గ్రామానికి చెందిన గుర్రం సుధారాణి అనే మహిళా రైతుకు మూడెకరాల 32 గుంటల భూమి ఉంటే రూ.2,400 రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయని, ఇదే ప్రజా పాలన అని నిలదీశారు. హామీలు అమలు చేయకపోవడంతో రైతులు, మహిళలు, యువత నిలదీస్తుండడంతో రాజీవ్ యువ వికాసం పేరుతో నయా మోసానికి తెర లేపారని మండిపడ్డారు.
పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెట్టి కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌కు ధాన్యం వస్తున్నా నేటికీ కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్‌కైనా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వేమవరపు సుధీర్‌బాబు, పట్టణ కార్యదర్శి జాడ సంతోశ్, నాయకులు ఆమేర్, మిర్యాల మల్లేశం, రామిని లక్ష్మణ్, యానాల లింగారెడ్డి, బాసాని రాజు, ఏజాస్, ఆవుల సత్తయ్య, అంజద్ పాల్గొన్నారు.