చిట్యాల, మార్చి 16 : సమైక్య పాలనలో బీడు భూములుగా మారిన తెలంగాణను బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చని పంట పొలాలుగా మార్చిందని, కానీ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి బీడు భూములుగా మారుతున్నాయని, కాంగ్రెస్ సర్కారు అవగాహన రాహిత్యంతోనే చేతికొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎకరానికి దాదాపు రూ.35 వేల వరకు ఖర్చు చేసి, రెండున్నర నెలలుగా శ్రమదానం చేసిన రైతులకు నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, ఎండిన పొలాలకు ఎకరాకు రూ. 50వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చిట్యాల మండలంలోని వెల్మినేడు గ్రామంలో ఆదివారం ఆయన ఎండి పోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నీళ్లు లేక బోర్లు ఎండి పోయి సగం పొలాలు ఎండిపోతే, లో ఓల్టేజీ కారణంగా మోటర్లు కాలి పోయి సగం పొలాలు ఎండిపోతున్నాయని రైతులు చిరుమర్తి దృష్టికి తీసుకువచ్చారు.
పొట్టకొచ్చిన పంటలు దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు రైతు భరోసా, రుణ మాఫీ చేస్తామని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చాక రైతులకు మేలు చేయడం లేదని మండిపడ్డారు. రుణ మాఫీ పూర్తిగా చేయలేదని, రైతు భరోసా మొక్కుబడి ఇస్తున్నారని, ఉచిత విద్యుత్ 10 గంటలు కూడా వస్తలేదని, అదికూడా లోఓల్టేజీతో వస్తుందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో విష ప్రచారం చిమ్మిన రేవంత్ ఇప్పుడు నిజమైన వార్తలు ప్రచారం చేస్తే సోషల్ మీడియా, యూ ట్యూబర్లపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా తను ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని మరిచి మాటలు మాట్లాడుతున్నాడని, మీడియాపై విషం కక్కుతున్నాడని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేని రేవంత్‌రెడ్డి పోలీసు రాజ్యం నడుపుకుంటూ మైకులలో ఊదరగొడుతున్నాడని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికమని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాం డ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు దేవరపల్లి సత్తిరెడ్డి, రాచకొండ కిష్టయ్య, కొలను వెంకటేశం, ఎ.శ్రీశైలం, బొంతల రామకృష్ణారెడ్డి, కొలను సతీవ్, దేవిరెడ్డి సుధాకర్రెడ్డ్డి, జినుకల ప్రభాకర్, అంతటి రాకేశ్, బైకాని నర్సింహ, మాస జగన్, గుర్రం యాదయ్య, పబ్బు చంద్రశేఖర్, అరూరి ధనుంజయ్య ఉన్నారు.
ట్యాంకర్‌తో పంటను కాపాడుకుంటున్నాం
నాలుగున్నర ఎకరాల్లో వరి పంట వేసిన. నీళ్లు లేక రెండున్న ఎకరాలు ఎండిపోయింది. నాకు నాలుగు బోర్లు ఉంటే అందులో మూడు ఎండిపోయినయి. గతంలో ఎప్పుడూ ఇట్లాంటి పరిస్థితి రాలే. మిగిలిన పొలాన్నైన బతికించుకోవడానికి రోజూ ట్యాంకర్‌కు 1500 రూపాయలు ఇచ్చి నీళ్లు పోయిస్తున్నా. లో ఓల్టేజీ సమస్య వల్ల నాలుగు సార్లు మోటర్లు కాలిపోయినయి.ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పోతున్నా.
– మంకాల బాలయ్య, రైతు, వెల్మినేడు, చిట్యాల మండలం
ఎకరంన్నర ఎండింది..
పొట్టకొచ్చిన పంట ఎండిపోయింది. చేసేదేమీ లేక జీవాలను మేపుతున్నా. బోర్లలో నీళ్లు అడుగంటిపోయినయి. లో ఓల్టేజీ సమస్యతో సతమతమవుతున్నాం. రెండెకరాల్లో వరి వేస్తే ఎకరంన్నర ఎండిపోయింది. మూడు బోర్లకు మూడు బోర్లలో నీళ్లు తగ్గినయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సమస్య ఎదుర్కోలే. అప్పులు కరెంటు కొరత లేదు.. లో ఓల్టేజీ సమస్య లేదు.
– ఏనుగు మల్లారెడ్డి, రైతు, వెల్మినేడు, చిట్యాల మండలం