నకిరేకల్, జూన్ 1 : తెలంగాణ ప్రజల ఆదరణను చూసి ఓర్వలేకనే రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాడని, రేవంత్..నీకు దమ్ముంటే యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిపై ఒట్టేసి రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. సోమవారం నకిరేకల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు డిస్కమ్ ఏర్పాటుతో 7-8 గంటలు కరెంటు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నాడన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వకపోతే బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతు డిస్కమ్‌తో వ్యవసాయ రంగానికి ఉరి బిగుసుకుంటుందన్నారు.
విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల విద్యుత్తుకు గండికొట్టేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం 3 గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని చెప్పి, ఆ విషయాన్ని అధికారంలోకి వచ్చాక ఆచరణలోకి తెస్తున్నాడన్నారు. కేసీఆర్ 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తే ఫ్రీ కరెంటుకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రైతు డిస్కమ్‌ను తెరపైకి తెస్తోందన్నారు.
ఎన్నికల ముందు రైతులకు రైతుబంధు రూ.10 వేలకు బదులు రూ.15 వేలు ఇస్తామని, 24 గంటల కరెంటు ఇస్తామని, బోనస్ ఇస్తానని బోగస్ మాటలు చెప్పి డిస్కమ్‌ల పేరిట కరెంటు కట్ చేసేందుకు కుట్రపన్నుతున్నారన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెడతామంటే కేసీఆర్ ఒప్పుకోలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్లో చీలిక తేవాలని రేవంత్‌రెడ్డి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడని, అది జరగని పని అన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడుతున్న కేటీఆర్, హరీశ్‌రావుపై చిల్లర కామెంట్లు చేయడం, అక్రమ అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నైజమన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వారికి తెలియకుండానే వారి జీతాల్లో 1.5 శాతం కట్ చేయడం దుర్మార్గమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సందినేని వెంకటేశ్వరరావు, కడపర్తి సర్పంచ్ గొర్ల వీరయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మాజీ కౌన్సిలర్ పల్లె విజయ్, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న, సీనియర్ నాయకులు పెండెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.