కోదాడ, జనవరి 24 : కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ఆయకట్టు చివరి ప్రాంతం రైతులకు సాగునీరు అందించేందుకు పదుల కొద్ది ఎత్తిపోతలు మంజూరు చేయించానని చెప్పుకొనే మంత్రి ఉత్తమ్ మాటలు గాలి కబుర్లేనని, ఇప్పటికీ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడలోని తన నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం అగ్రభాగాన ఉన్నదని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఉత్తమ్.. గ్రామసభల్లో ప్రజలు నిలదీస్తున్న వాస్తవాలను అవగతం చేసుకోవాలన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై నిరుపేదలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. హామీ ఇచ్చిన ఏ ఒక్క పథకాన్నీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. కోదాడ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఓటేసిన ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు.
మాదారం, సింగారం, రెడ్లకుంట ఎత్తిపోతల నుంచి ఒక్క ఎకరాకు కూడా చుక్కనీరు అందలేదని, మోతె మండలానికి పాలేరు నుంచి సాగునీరు రప్పిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే గోదావరి జలాలు మోతె, నడిగూడెం, మునగాల మండలాల భూములను తడిపాయని తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో వారి అభివృద్ధి శంకుస్థాపన చేసిన శిలాఫలకాల్లోనేనని, ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా పోయలేదని అన్నారు. అభివృద్ధి పనుల పేరుతో కమీషన్లు దండుకోవడమే ఆయన పని అని ఆరోపించారు. కోదాడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందన్నారు. ఇప్పటికైనా గెలిపించిన నియోజకవర్గాల్లో ఉత్తమ్, పద్మావతి దంపతులు నిబద్ధతతో అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు నయీం, భూపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బట్టు శివాజీనాయక్, నాయకులు అజయ్‌కుమార్, నర్సిరెడ్డి, రమేశ్, జానకి, రామాచారి, రమేశ్, సురేశ్‌నాయుడు, ఇమ్రాన్‌ఖాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.