దేవరకొండ రూరల్, సెప్టెంబర్1 : మండలంలోని కొండ భీమనపల్లి శివారులో ఉన్న బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఆదివారం బీఆర్ఎస్ మాజీ మంత్రులు, సిద్దిపేట, సూర్యాపేట ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సందర్శించారు.
గత నెల 26న గురుకులంలో విద్యార్థులపై ఎలుకల దాడి ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. సంఘటన జరిగిన మరుసటిరోజు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇదే విషయమై గాయపడిన 13మంది విద్యార్థులను ఆదివారం మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు. అక్కడ నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఫ్యాన్లు లేకపోవడం వల్ల కిటికీలు తీయడంతో అందులో నుంచి ఎలుకలు వస్తున్నాయని, నిద్రిస్తున్న సమయంలో దాడి చేస్తున్నాయని విద్యార్థులు వారికి తెలిపారు. బాత్రూం డోర్లు సరిగా లేకపోవడం, దోమ తెరలు లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. కరెంట్ పోయినప్పుడు జనరేటర్ లేకపోవడం వల్ల చీకట్లో అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రగ్గులు, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ డ్రెస్సులు అందించలేదని, భోజనం నాణ్యత లేదని విద్యార్థులు తమ గోడు వినిపించారు.
ఇంకా పలు సమస్యలతో సతమతమతున్నామని విద్యార్థులు నాయకులతో చెప్పి వాపోయారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తమ ఆరోగ్యాలను కాపాడాలని వారి ముందు కోరారు. ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించామని తెలిపారు.
బీసీ గురుకుల పాఠశాల చుట్టూ చెట్లు, పొదలు ఉన్నందున పాములు, తేళ్లు వచ్చే అవకాశం ఉందని, యాంటీవీనమ్ ఇంజెక్షన్ కూడా దగ్గర ఉండకపోవడం నిర్లక్ష్యాన్ని చూపుతుందని, ఇది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్వ్రీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రేగట్టె మల్లికార్జున్, టీవీఎన్‌రెడ్డి, పల్లా ప్రవీన్‌రెడ్డి, చింతపల్లి సుభాశ్, గాజుల రాజేశ్ పాల్గొన్నారు.