మర్రిగూడ, నవంబర్ 13 : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు దుఃఖం తప్పడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. వడ్లు తెచ్చి ఎన్ని రోజులు అవుతుందని అడిగారు. ఇప్పటివరకు ఏమైనా వాటి డబ్బులు అందాయా అని అడుగగా వడ్లు అమ్మి వారం రోజులైనా ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు రాలేదని రైతులు వెల్లడించారు. దొడ్డు రకం వడ్లను మర్రిగూడలో.. సన్న రకం వడ్లను యరగండ్లపల్లిలో ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సన్నాలు ఇప్పటివరకు కొనడం లేదని మాజీ మంత్రి ఎదుట రైతులు వాపోయారు. తరుగు పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో సివిల్ సప్లయ్ మంత్రి ఉండి కూడా రైతులకు ప్రయోజనం లేదని.. ఇప్పటివరకు రైతులకు రూపాయి చెల్లించ లేదన్నారు. మంత్రులు గాలి తిరగడం మాని భూమి మీదకి రావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే, సాగితే ఈసారి పుష్కలంగా నీళ్లు ఉండటం వల్ల ఐదున్నర లక్షల సాగు జరిగిందని తెలిపారు. ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు.
ధాన్యం దిగుబడి అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా, రుణమాఫీ సరిగా చేయకుండా, పండించిన పంటలను కొనకుండా ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మండిపడ్డారు. జిల్లాలో ఇప్పటివరకు సన్నవడ్లను కొన్న దాఖలాలు లేవని, రేవంత్ రెడ్డి బోనస్ ఎలా ఇస్తాడని ప్రశ్నించాడు. రూ.1800కే క్వింటాలు చొప్పున అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే 200 రూ.కోట్లు చెల్లించాల్సి వస్తుందని.. అందులో ఇప్పటివరకు 50 కోట్లు మాత్రమే చెల్లించాలని అన్నారు. రైతులకు సకాలంలో డబ్బులు అందించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని చెప్పారు.
రైతుల ధర్నాలు రాస్తారోకోలు…
వడ్లకు మద్దతు ధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. కాటన్ మిల్లుల దగ్గర పత్తి రైతులు ధర్నాలు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. రైతులు ప్రభుత్వాన్ని నమ్మలేకనే దళారులను ఆశ్రయించి వడ్లను అమ్ముతున్నారని తెలిపారు. కేసీఆర్ కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు కింద సాయం అందించడమే కాకుండా పండించిన పంటలను నిరాటంకంగా కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరవాలన్నారు. ఈ యాసంగి పంటకైనా రైతులకు రైతు భరోసా కింద సాయం అందించాలని డిమాండ్ చేశారు.
గ్యారెంటీలకు ఇజ్జత్ లేకుండా చేసిన ప్రభుత్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ అనే పదానికి ఇజ్జత్ లేకుండా చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని గ్యారెంటీ ఇచ్చినట్లు చెప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యారెంటీలకు, బాండ్ పేపర్లకు విలువ, నమ్మకం లేకుండా పోయిందని విమర్శించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ఒట్టు వేసిన రేవంత్ రెడ్డి సగం మందికి కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయలేకపోయారని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వాయి స్రవంతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, మాజీ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, రైతుబంధు సమితి మాజీ కన్వీనర్ బచ్చు రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్లు బాల నరసింహ, పందుల యాదయ్య, మాజీ సర్పంచులు నల్ల యాదయ్య, చెరుకు లింగం గౌడ్, మాజీ ఎంపీటీసీ ఊరి పక్కన నగేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, నాయకులు రాపోలు యాదగిరి, కోలుకులపల్లి యాదయ్య, వల్లంల సంతోష్ యాదవ్, లప్పంగి భిక్షం, పగడాల రఘు, వట్టికోటి శేఖర్ పాల్గొన్నారు.