సూర్యాపేట టౌన్, అక్టోబర్ 1 : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు.. బుధవారం ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతోపాటు దేవీ శరన్నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకొనే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో ఖండంతరాలకు విస్తరించిందని గుర్తుచేశారు.
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను అధికారికంగా నిర్వహించిన ఘనత ఆనాటి మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ప్రతి బతుకమ్మ పండుగకూ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ కానుకగా చీరలు పెట్టి ఆదారాభిమానాలు చాటుకున్నారని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.