సూర్యాపేట, మే 10 (నమస్తే తెలంగాణ) : ‘పుత్ర వాత్సల్యంతో విపక్షంపై విమర్శలు చేస్తున్నారు సరే.. మీరు సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెలగబెట్టింది ఏంటో వివరించాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి సవాల్ విసిరారు. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 15 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా జిల్లాకు ఆయన చేసింది శూన్యమని చెప్పారు. అటువంటి జానారెడ్డి పుత్ర వాత్సల్యం కొద్ది సూర్యాపేటకు వచ్చి సూర్యాపేటకు జగదీశ్‌రెడ్డి ఏమీ చేయలేదనడం, ఆ ప్రకటనకు కొనసాగింపుగా మరో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి చేస్తున్న ప్రకటనలు వారి విజ్ఞతను బయట పెట్టినట్లయిందని దుయ్యబట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటకు వచ్చిన జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి ఘాటుగా స్పందిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఆ సారాంశం ఆయన మాటల్లోనే.. ‘2014కు పూర్వం ఇక్కడి ప్రజలు ఎటువంటి నీళ్లు తాగేదో, సాగు నీరందక సూర్యాపేట, తుంగతుర్తి రైతాంగం ఏ తీరుగా అల్లాడి పోయిందో సుదీర్థకాలంగా అధికారంలో ఉన్న మీకు తెలియకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు బాగా తెలుసు. చాలీచాలని విద్యుత్, అందీఅందని నీటితో ఆత్మక్షోభను ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకున్న చరిత్ర మీకెక్కడిది? చందాల దందాల గురించి మాట్లాడాల్సి వస్తే.. మీరు వచ్చింది వైట్ హౌసో, రెడ్ హౌసో మాకైతే తెలీదు కానీ.. అక్కడి నుంచే కదా చందాల దందాలు సాగేది.
అటువంటి ఇంటి నుంచి మీలాంటి వారు సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఇక్కడి ప్రజలెవరూ విశ్వసించరు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే 2014కు పూర్వ దుస్థితి ఉత్పన్నం కావడంతో సూర్యాపేటలో వర్తక, వాణిజ్య వర్గాలు హడలెత్తి పోతున్నాయి. చివరికి వైద్యులు కూడా మీ పార్టీ నేతల ఆగడాలతో భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా మీ నోటి నుంచి కూడా అభివృద్ధి మాట రావడం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తుకు రాని అభివృద్ధి మాట ఇప్పుడు మీ నోటి నుంచి వచ్చిందంటే అది ముమ్మాటికీ కేసీఆర్ ఘనతగానే భావించాల్సి ఉంటుంది.
దశాబ్ద కాలంగా 75వేల కోట్ల రూపాయలతో అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టించడం నేను మంత్రిగా సాధించిన విజయమే. ఒకప్పుడు అన్నానికి అవస్థ పడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరుసగా నాలుగు సంవత్సరాలు 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించింది కూడా బీఆర్ఎస్ ఎలుబడిలోనే. అటువంటి సుభిక్షంగా ఉన్న రాష్ట్రంలో అబద్దపు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన మీరు నాలుగు నెలల వ్యవధిలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోయేలా చేసి 2014కు పూర్వ దుస్థితికి నెట్టి వేరు. బీఆర్ఎస్ పాలనలో అటువంటి పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు సాగర్‌లో 510 అడుగుల్లో నీళ్లున్నా ఎడమ కాల్వ కింది భూములకు నీళ్లు ఇచ్చాం.
ఇప్పుడు 515 అడుగుల్లో నీళ్లున్నా పొట్టకు వచ్చిన పంట పొలాలను కాపాడలేక పోయిన ఘనత మీకు, మీ పార్టీకే దక్కింది. 2 వేల ఆసరా పెన్షన్ ఇస్తున్న కేసీఆర్‌ను ప్రజలు పెద్ద కొడుకుగా భావిస్తున్న తరుణంలో 4 వేలు పింఛన్ ఇస్తానంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి మాట తప్పిండు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించేందుకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉంచిన 75వేల కోట్లను కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు చెల్లించింది నిజం కాదా? పెట్టుబడి సాయం 10వేల నుంచి 15వేలు చేస్తామన్నారు. రుణమాఫీ లక్ష నుంచి రెండు లక్షలు అన్నారు.
500 బోనస్‌తో 2,500 గిట్టుబాటు ధర అన్నారు. వాటి అమలులో జరుగుతున్న ఉదాసీనతపై జానారెడ్డి వంటి సీనియర్ నేతలు మాట్లాడితే బాగుండేది. కంప్యూటర్లు కొనుక్కోవడానికి విద్యార్థులకు 5 లక్షల కార్డులంటిరి, అక్కడెక్కడో ఉన్న ప్రియాంకాగాంధీ బాధ పడుతున్నది.. ఆమె చెప్పిందంటూ కాలేజీకి పోయే ఆడ పిల్లలకు స్కూటీలంటిరి. నిరుద్యోగులకు భృతి అంటూ ఫోర్ట్వంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన మీరు అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తారని యావత్ నల్లగొండ ఎదురు చూసింది. అందుకు భిన్నంగా పుత్ర వాత్సల్యంతో ఇక్కడికి వచ్చిన మీరు ఇటువంటి ఆరోపణలు చేయడంతో మీ మీద ఉన్న గౌరవం ఇప్పుడు పాతాళంలోకి పోయింది.
పైగా అధికారంలోకి వచ్చీ రాగానే కృష్ణా జలాలపై కేంద్రానికి హక్కులు కల్పించి ఇక్కడి రైతాంగాన్ని మీరు వంచనకు గురి చేస్తే గోదావరి జలాలను కావేరిలో కలిపే కుట్రలకు మోదీ తెర లేపారు. అటువంటి కుట్రల నుంచి కృష్ణా, గోదావరి జలాలను కాపాడే శక్తి ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉంది. తెలంగాణ, పైన మహరాష్ణ, కర్ణాటకతోపాటు కింద ఆంద్రప్రదేశ్, తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీ ఉన్నందున తెలంగాణ ప్రాంత హక్కుల గురించి నీటి గురించి మాట్లాడలేదు’ అంటూ జగదీశ్‌రెడ్డి ఘాటుగా జానారెడ్డికి ఘాటుగా బదులిచ్చారు. ఈ పరిస్థితున్నింటిని గుర్తించి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్‌కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.