సూర్యాపేట, జనవరి 11 : 2014కు ముందు రాష్ట్రం ఎట్లుండేనో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అట్లనే ఉందని, కాంగ్రెస్ పాలనతో జనం విసిగి పోయారని, ప్రజల మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి కావాలో..అరాచకాలు కావాలో జనమే తేల్చుకోవాలన్నారు. ‘మోసకారి కాంగ్రెస్‌ను ఓడించి, అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు మద్దతివ్వండి’ అనేదే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నినాదం కావాలన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అరాచకాలు, కబ్జాలు, బెదిరింపులు, అక్రమ కేసులు పెరిగాయన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి ఫలితాలు వస్తాయని, ప్రతి మున్సిపాల్టీలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు, రేవంత్ చీకటి ఒప్పందాలు
తమ రాజకీయ అవసరాల కోసం రేవంత్‌రెడ్డి అమ్ముడుపోతున్నాడని కృష్ణ, గోదావరి జలాలను ఆంధ్రకు దోచి పెడుతున్నాడని అన్నారు. బనకచర్ల పేరు మార్చి నల్లమల్ల సాగర్ అంటున్నాడని, దానికి ఏ పేరు పెట్టినా జరిగేది తెలంగాణ నీళ్ల దోపిడే అన్నారు. చంద్రబాబును సంతృప్తి పర్చడమే రేవంత్ లక్ష్యమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను కాపాడుకుంటామని ఆయన అన్నారు.

మంత్రులపై ఆరోపణలు వస్తే తప్ప స్పందించరా?
నాడు కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది కాంగ్రెస్ మంత్రులు కాదా.. ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాయించిన్రు.. నాడు సోయిలేదా.. ఇప్పుడు తమపై ఆరోపణలు వస్తే బాధైతుందా అని కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మొదటి నుంచి ఆరోపణలపై చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు. గాంధీ భవన్, సీఎంవో ఆఫీసు నుంచి ఘోస్టు సైట్లు పని చేస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, హుజూర్నగర్ ఇంచార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ జడ్పీటీసీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, కొణతం సత్యనారాయణరెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మాజీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలు ప్రజాక్షేత్రంలో ఎండగడదాం

నేరేడుచర్ల, జనవరి 11 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు, ఎన్నికల అధికారులతో కలిసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన సాగిస్తోందన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
కాంగ్రెస్ పాలనతో జనం విసుగెత్తిపోయారని, కారు గుర్తు కనబడితే చాలు ఓటసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ వంతెనలు, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తే..నేటి ప్రభుత్వం హైడ్రా పేరుతో కొంపలు కూలుస్తోందన్నారు. ఏ నీరు ఎటు పోతుందో, ఏ వంతెన ఎక్కడుందో నీళ్ల మంత్రి ఉత్తమ్‌కు తెలియదన్నారు. గురుకుల పాఠశాలల్లో సుమారు 100 మంది విద్యార్థులు మృతి చెందినా ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసులు, ఉద్యమాలు కొత్త కాదని, ఎలాంటి కేసులైనా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఉందన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని కొంత మంది పోలీసు అధికారులు కాంగ్రెస్ నాయకులకంటే ఎక్కువగా అతి చేస్తున్నారని, రానున్న కాలంలో వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గ్రామాల్లో ఘర్షణలు సృష్టిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి నాయకుడిని నిలబెట్టి, గెలిపించుకోవాలని సూచించారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది..
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు విజయం సాధించారని నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని జనం ఎదురు చూస్తున్నారని చెప్పారు. సమావేశంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ చందమళ్ల జయబాబు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, ఉద్యమ నాయకుడు కొణతం లచ్చిరెడ్డి, రాపోలు నవీన్, ఇంజమూరి రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు ఉన్నారు.