తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ గుర్తులను నెమరువేసుకునేలా, నాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా… యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ నెల 29వ తేదీన దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ప్రాణత్యాగానికి సిద్ధపడి నాటి ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ర్టానికి శ్రీకారం చుట్టారన్న విషయాన్ని మరోసారి దీక్షా దీవస్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అందుకే దీక్షా దివస్‌ను ఈ నెల 29వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా వేలాది మందితో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం దీక్షా దివస్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనికి ఆయా జిల్లా ఇన్చార్జిలతో కలిసి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. దీక్షా దివస్ రోజున ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసేలా ఫొటో ఎగ్జిబిషన్లను, వీడియోలను సైతం ప్రదర్శించేలా చూడాలని నేతలకు సూచించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం పార్టీ జి ల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు కార్యక్రమ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకాగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండ, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో శాసనసభలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించాలని చూడగా.. అదే తెలంగాణ పేరుతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించిన రాష్ట్ర సాధకుడు, తొలి సీఎం కేసీఆర్ సరికొత్త చరిత్రను లిఖించారన్నారు.
దేశానికి స్వాతంత్య్రం కావాలన్న ఆకాంక్ష 1857లోనే సిఫాయిల తిరుగుబాటుతో మొదలైతే గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన విధంగానే కేసీఆర్ అంతకుముందు నడిచిన ఉద్యమాలు, వాటిపై నిర్బంధాల నుంచి సరైన దిశలో ఆలోచన చేసి రాష్ర్టాన్ని సాధించుకొచ్చారని చెప్పారు. 2001లో నా స్నప్నం.. నా ధ్యేయం తెలంగాణ రాష్ట్ర సాధననే అని బయల్దేరిన కేసీఆర్… 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. 14 ఏండ్లు అలుపెరుగని పోరాటంతో ప్రాణాలను పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై ప్రత్యర్థులు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తల కడుపుమాడ్చి… ప్రజల కడుపు నింపడమే ధ్యేయంగా కేసీఆర్ పాలన కొనసాగిందని గుర్తు చేశారు. ఏడాది తిరక్కముందే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారన్నారు.
కేసీఆర్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడంలో, ఆయన త్యాగాన్ని ప్రజలకు వివరించడంలో వైఫల్యాలు ఉండకూడదన్నారు. ఉద్యమకాలం నాటి ఘటనలను, కేసీఆర్ త్యాగాలను, రాష్ట్ర సాధన పోరాటాన్ని నేటి తరానికి మనం వారసత్వంగా అందించాల్సిన కర్తవ్యం మన ముందుందని తెలిపారు. కేసీఆర్ లేకుంటే అసలు తెలంగాణ పదమే లేదన్న విషయాన్ని నేటి యువతకు చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. దీక్షా దివస్‌ను నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా, పెద్ద ఎత్తున యువతను భాగస్వామ్యం చేసేలా నిర్వహించాలని సూచించారు. దీని కోసం ప్రతి గ్రామం నుంచి యువత తరలివచ్చి దీక్షా దివస్‌లో పాల్గొనేలా పార్టీ నేతలు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 29న జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున వేలాది మందితో దీక్షా దివస్‌లు విజయవంతం చేయాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు రామచంద్ర నాయక్, పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజు యాద వ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, ఐసీడీఎస్ మాజీ ఆర్వో మాలె శరణ్యారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు చెరుకు సుధాకర్, కటికం సత్తయ్య గౌడ్, నిరంజన్ వలీ, బోనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
దీక్షా దివస్‌కు భారీగా కదలాలి : మాజీ ఎంపీ, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మన్నె శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణను సాధించి, దాని రూపురేఖలే మార్చి, దేశంలోనే అద్భుతంగా అభివృద్ది చేసిన ఘనత కేసీఆర్‌దే. అట్లాంటి కేసీఆర్ మీద లేనిపోని కల్లబొల్లి కథలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దేశంలోనే గొప్పగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ర్టాన్ని అనాలోచిత నిర్ణయాలతో సీఎం రేవంత్‌రెడ్డి ఆగం చేస్తున్నాడు. అందుకే ఏడాది తిరగక ముందే ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆనాటి ఉద్యమ గుర్తులను, కేసీఆర్ త్యాగాలను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలి. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలి.
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాధన : దీక్షా దివస్ సూర్యాపేట ఇన్చార్జి, నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి
కేసీఆర్ చేసిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో వివక్షకు గురైనందునే కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధించాలని నడుము కట్టి ముందుకు సాగారు. చావు నోట్లో తలకాయ పెట్టిన కేసీఆర్ దీక్షతోనే నాడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిందని, ఈ విషయాన్ని మరోసారి ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. మార్పులో భాగంగా ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఇప్పుడు అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణను పదేండ్ల పాటు అభివృద్ధి చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు.
ఏడాదిలోనే వ్యతిరేకత మూట కట్టుకున్న కాంగ్రెస్ : నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి అన్ని వర్గాల కడుపులు నింపితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలుపొందుతుంది. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను చూసి కాంగ్రెసోళ్లు వణికిపోవాలన్నారు. పార్టీ మారిన వాళ్లు అందులో ఇమడలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్లో ఉన్నవారే స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నారు.
పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి : మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
ఈ నెల 29న నల్లగొండలో నిర్వహించే దీక్షా దివస్‌కు పెద్దఎత్తున తరలిరావాలి. మిర్యాలగూడ నుంచి వెయ్యి మంది కార్యకర్తలు ఈ దివస్‌కు రావాలి. కేసీఆర్ చేసిన ఉద్యమం, ఆయన పోరాట పటిమ ప్రతి ఒక్కరూ మరోసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన త్యాగాల మీద పుట్టిన తెలంగాణ ఇవ్వాళ స్వరాష్ట్రంలో ఎన్నో విజయాలు సాధించింది. గొప్ప తెలంగాణను ఏడాదిలో రేవంత్ సర్కార్ నాశనం చేశారు.
కేసీఆర్ లేకపోతే రేవంత్ సీఎం అయ్యేటోడా : మునుగోడు మాజీ ఎమ్మెల్యే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా, తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేటోడా? తెలంగాణ రాష్ట్ర సాధన వల్లే రేవంత్ సీఎం అయింది నిజం కాదా అని, ఆయన ఆ విషయాన్ని మరిచి అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. అభివృద్ధి చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కార్‌కు మాటలు తప్ప సాధించింది ఏమి లేదనే విషయం ప్రజలకు అర్థమైంది. చేతగాని ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో నిలదీయాలి.
యువతకు దీక్షా దివస్ గురించి తెలియాలి: దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ఈ నెల 29న నల్లగొండలో నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి. ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి నేటి యువతరానికి దీక్షా దివస్ అంటే ఏమిటో తెలియచేయాలి. కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్ల అప్పట్లో కేంద్రమే కదిలివచ్చి తెలంగాణ ఇచ్చిన విషయాన్ని యావత్ దేశానికి మరోసారి చాటాల్సిన బాధ్యత బీఆర్ఎస్ సైనికులపై ఉన్నది. రాష్ట్రం సాధించాక పదేండ్ల పాలనలో కేసీఆర్ అన్ని వర్గాలకు మంచి ఫలితాలు ఇచ్చారు. ఈ విషయం మరోసారి తెలియచెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది.
ప్రతి గ్రామంలో కేసీఆరే కనిపిస్తుండు : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ఇవ్వాళ ఏ గ్రామానికి వెళ్లినా కేసీఆర్ చేసిన అభివృద్ధే కనిపిస్తున్నది. ప్రతి నెలా పంచాయతీలకు నిధులు ఇచ్చి వైకుంఠ ధామం నుంచి నర్సరీల వరకు నిర్మాణాలు చేపట్టి స్వచ్ఛ పల్లెలుగా కేసీఆర్ తీర్చిదిద్దారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆరు గ్యారెంటీలు ఇవ్వలేదని, 420 హామీల ఊసే లేదు. కేసులు పెట్టి భయపెట్టే కాంగ్రెసోళ్లు పాలన గాలికి వదిలేశారు.. కేసులకు భయపడే ప్రసక్తే లేదు.
పార్టీ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సేన సిద్ధమవ్వాలి : నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
పార్టీ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సేన సిద్ధమవ్వాలి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుంది. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో అభివృద్ధి ఫలాలు ఇస్తే, ఏడాదిలోనే రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసింది. దీనికి వచ్చే ఎన్నికల్లో రేవంత్ సర్కార్ తగిన మూ ల్యం చెల్లించుకుంటుంది.. కేసీఆర్ దీక్షతో వచ్చిన తెలంగాణలో మరోసారి దీక్షా దివస్ ఘనంగా నిర్వహించుకుందాం.