సూర్యాపేట, జూలై 27 (నమస్తేతెలంగాణ) : రేషన్ కార్డుల పంపిణీ ని రంతర ప్రక్రియ అని గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ 6.47 లక్షల కార్డులు పంపిణీ చేశారని మాజీ మంత్రి, సూ ర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిరుపేదలకు రేషన్‌కార్డులు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కార్డుకు కేవలం నాలుగు కిలోల బియ్యం మాత్రమే ఇచ్చారని దాన్ని ఆరు కిలోలు చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కుటుంబంలో పెద్దలతో పాటు పిల్లలకు సైతం రేషన్ అందించారని, కార్డులున్న వారు ఎక్కడుంటే అక్కడ రేషన్ తీసుకునే వెసులుబాటు ఆనాడే కల్పించామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత. పాలకులదేనని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే తప్పకుండా అభినందిస్తామన్నారు.
మహిళలకు రూ 2500లు ఇస్తే మహాలక్ష్మి పథకం సంపూర్ణమవుతుందన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని, రైతుబంధు రెండుసార్లు ఎగవేశారని, అది కూడా 15వేలు ఇస్తే తప్పకుండా సీఎంకు ధన్యవాదాలు తెలుపుతామన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో వేణుమాధవరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు.