నీలగిరి, జనవరి 24 : ‘రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అందుకు ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభలే నిదర్శనం. ప్రభుత్వంపై రైతులు, ప్రజలు పోరాటానికి స్వచ్ఛంధంగా సిద్ధ్దమై ముందుకు వస్తున్నారు. వాటికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది.’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతులు, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అణిచివేయాలనే చిల్లర ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల మీటింగులు అడ్డుకునే కుట్రలు చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలే నిలదీస్తున్నారని, పోరాటాలకు సైతం సిద్ధపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయి ప్రజలను దోచుకుంటున్నాయని అరోపించారు. ఈ పరిస్థితిల్లో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలబడుతున్నారన్నారు.
ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతాంగం కేటీఆర్‌ను పిలిచి ఆందోళనకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. కరెంటు కోతలు, ఎరువుల కొరత, రైతుబంధు, రుణమాఫీ అమలుపై రైతులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అందులో భాగంగానే నల్లగొండలో ధర్నాకు సిద్ధపడితే అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తే కోర్టులు తమకు అండగా నిలిచాయని అన్నారు. కోర్టు అనుమతితో ఈ నెల 28న ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారని, పోలీస్ యంత్రాంగం, అధికారులు సహకరించాలని కోరారు. జిల్లా మంత్రికి దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోతుందన్నారు. రైతులను మోసం చేస్తూ మిల్లర్ల దగ్గర కమీషన్ తీసుకుంటున్నారని, జిల్లా రైతాంగానికి వెయ్యి కోట్ల రూపాయల వరకు మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న రైతులపై దాడులు చేస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లాకు కొత్తగా ఒక్క రూపాయి కూడా తెచ్చింది లేదని.. గతంలో కేసీఆర్ ఇచ్చిన నిధులతోనూ పనులు ముందుకు పోతలేవని పేర్కొన్నారు. జిల్లా మంత్రి చేస్తున్న మోసాలపై రైతులు కదిలి రావాలని పిలుపునిచ్చారు.
కొన్న ధాన్యం, చెల్లించిన బోనస్ వివరాలు ప్రకటించాలి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని, ఆయనకు దమ్ముంటే రాష్ట్రలో గత సీజన్లో పండించిన ధాన్యం, కొనుగోలు చేసిన సరుకు, రైతులకు చెల్లించిన బోనస్‌పై ప్రకటన చేయాలని సవాల్ చేశారు. ఇంతవరకు ఎంత ధాన్యం కొన్నారో చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని రైతుల విషయం మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను చూసి పారిపోతున్నారని పేర్కొన్నారు. అంధ్రాతో కొట్లాడి కృష్ణా జలాలు తెచ్చి పారించామని, 40లక్షల టన్నుల ధాన్యం పడించి నల్లగొండను అన్నపూర్ణగా మార్చిన ఘనత తమదని చెప్పారు. అందుకే ప్రజల్లోకి ధైర్యంగా వస్తున్నామన్నారు. గ్రామ సభల జాబితాలపై ప్రభుత్వం తిరోగమనం పట్టిందని, ఇప్పటికే మూడు సార్లు దరఖాస్తులు చేశారని, అవి ఎటు పోయాయని ప్రశ్నించారు. వాటిని కూడా అమ్ముకునే దౌర్భాగ్యులు కాంగ్రెస్ నేతలని ఆరోపించారు.
ఉత్తమ్, భట్టి మాటల్లోనే దావోస్ డొల్లతనం
కేటీఆర్ ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడు లక్షల ఉద్యోగాలను 9 లక్షలకు చేర్చారని, రూ.40వేల కోట్ల ఐటీ ఎగుమతులను రూ.2.40 లక్షల కోట్లకు పెంచారని తెలిపారు. మంత్రులు భట్టి, ఉత్తమ్ మాటల్లోనే దావోస్ డోల్లతనం స్పష్టంగా కనిపించిందన్నారు. దావోస్‌లో పెట్టుబడులన్నీ ఇంతకు ముందు కేటీఆర్ హయాంలోనే జరిగాయని, దావోస్ వేదికగా మెగాతో ఒప్పందం డెస్టినేషన్ పెళ్లిలా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరుతో తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 20లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కేటీఆర్‌ది అన్నారు. సంచులు మోసిన అనుభవం ఉన్న రేవంత్‌రెడ్డి లాంటి వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమని, కేటీఆర్‌తో ఎందులోనూ పోటీ పడలేరని, చిల్లర చేష్టలు.. చిల్లర మాటలతో తెలంగాణ పరువు తీస్తున్నారని పేర్కొన్నారు.
సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, నాయకులు నిరంజన్ వలీ, మందడి సైదిరెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్‌యాదవ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ ఎంపీపీలు కరీంపాషా, నారబోయిన భిక్షం, మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, నాయకులు అయితగోని యాదయ్య, మారగోని గణేశ్, రంజిత్, జమాల్ ఖాద్రి పాల్గొన్నారు.