సూర్యాపట, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ) : తెలంగాణాలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియాపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఐదో వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ బాషామియా అక్రమ అరెస్టును ఆయన ఖండిస్తూ విలేకరులతో మాట్లాడారు. యూరియా కోసం రైతులు నిలబడిన క్యూలైన్‌ను వీడియో తీసి పెట్టినా కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అర్థం లేని కేసుల్లో అర్ధరాత్రి అరెస్టులు అక్రమమన్నారు. ఓ తాగుబోతు ఇచ్చిన ఫిర్యాదుతో తమ పార్టీ సీనియర్ నాయకుడిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. జనం ఒత్తిడితోనే ఈ రోజు పోలీసులు తలొగ్గారని, చట్టానికి విరుద్ధంగా పోలీసులు నడవద్దన్నారు.
జనం ఒత్తిడితోనే ప్రభుత్వం మెడలు వంచాలని ఇలాంటి ఉద్యమాలు కేవలం కార్యకర్తలను విడిపించుకోవడం కోసమే కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కొనసాగుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు గడువిచ్చామని, ఇది కేసీఆర్ విజ్ఞతకు నిదర్శనమన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో చేస్తున్న మోసాలను ఒకటొకటిగా ఎండగడతామన్నారు. ఎన్ని కేసులు పెడతారో.. ఎంత మందిని జైలులో పెడతారో చూస్తామన్నారు. ఉద్యమాలు, కేసులు తమకు కొత్త కాదని, ప్రజా ఉద్యమాలు మొదలైతే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ప్రజల అండ ఉన్నంత వరకు ఎలాంటి కేసులు భయపెట్టలేవన్నారు. సూర్యాపేట, నల్లగొండ ఎస్పీలు లా అండ్ ఆర్డర్ విషయంలో అదుపు తప్ప వద్దని పోలీసులు, అధికారులు చట్ట ప్రకారం పని చేయాలన్నారు. అక్రమ కేసులపై పెట్టే శ్రద్ధ యూరియా ఇవ్వడంపై పెడితే బాగుటుందన్నారు. చిల్లర కేసులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడేది లేదంటూ పార్టీ నాయకుణ్ని కాపాడుకోవడానికి వచ్చిన కార్యకర్తలు, మహిళలను ఆయన అభినందించారు. ఆయన వెంట మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ షేక్ బాషామియా, నాయకులు ఉప్పల ఆనంద్, జూలకంటి జీవన్‌రెడ్డి ఉన్నారు.