భువనగిరి అర్బన్, ఏప్రిల్ 21 : అబద్ధాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న రజతోత్సవ సభ విజయవంతానికి సోమవారం భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ రాదనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, దండగనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేసి, అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గోస పడుతున్నారని తెలిపారు. రేవంత్ సర్కారు హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనుకకు నెట్టేసిందని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రజలు ఆలోచించారని, రానున్న రోజుల్లో మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ వరంగల్‌లోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు భువనగిరి పట్టణం నుంచి ప్రతి వార్డు కమిటీ సభ్యులతోపాటు నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు.
రజతోత్సవ సభను పండుగలా జరుపుకొనేందుకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్నబోయిన ఆంజనేయులు, పెంట నరసింహ, నువ్వుల ప్రసన్నాసత్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కాజా అజీముద్దీన్, దిడ్డికాడి భగత్, నాయకులు కుశంగల రాజు, చెన్న మహేశ్, కడారి వినోద్, తుమ్మల పాండు, చికా ప్రభాకర్ గౌడ్, సుదగాని రాజు, సిద్దుల పద్మ, రత్నపురం పద్మ, బర్రె రమేశ్, ఎన్నబోయిన జహంగీర్, తాడూరు భిక్షపతి, తాడం రాజశేఖర్, ఇక్బాల్ దరి, ఇస్మాయిల్, ముజీబ్, నాగు, పెంట నితీశ్, నాగారం సూరజ్, సైదులు, ఇండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.