రామగిరి, జూన్ 18 : బదిలీలు, పదోన్నతుల కోసం కొందరు టీచర్లు అడ్డదారులు తొక్కుతూ విద్యా వ్యవస్థకు కలంకం తెస్తున్నారు. ఇటీవల పీఈటీల పదోన్నతుల వ్యవహారంలో నకిలీ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్ సృష్టించి సినియార్టీ జాబితాలో చోటు దక్కించుకున్న విషయం మరువకముందే.. స్కూల్ అసిస్టెంట్ బదిలీల్లో మరో ఘటన వెలుగు చూసింది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులంతా సబ్జెక్టు వారీగా బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. వాటి ఆధారంగానే విద్యాశాఖ సీనియారిటీ జాబితాలను వెల్లడించింది.
అయితే.. గతంలో వెల్లడించిన పాత జాబితాలో కొంత మంది ఉపాధ్యాయుల సీరియల్ నెంబర్, కొత్తగా వెల్లడించిన జాబితాల్లో సీరియల్ నెంబర్లో మార్పులు వచ్చినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. గుండ్లపల్లి (డిండి) మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు తాను ఉదోగ్యంలో (పాఠశాలలో) చేరిన సంవత్సరాన్ని ఆన్లైన్లో తప్పుగా నమోదు చేసింది. దీంతో బదిలీ సీనియారిటీ జాబితాలో ఆమె ముందు వరుసలోకి చేరింది. ఇలాంటి వారు ఇంకా కొంత మంది ఉన్నారని, ఆన్లైన్లో సమర్పించిన అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉన్నదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారితో నిజంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.