తుంగతుర్తి, నవంబర్ 12 : గాలికుంటు వ్యాధి నివారణకు పాడి రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించాలని సూర్యాపేట జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ డి.శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం గురించి మండలం వారిగా సమీక్షించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గం వారీగా సూర్యాపేట జిల్లా కింద 34,300కు గాను 24,250 పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. మొత్తం 14 బృందాలు ఈ టీకాలను వేయడం జరుగుతుందని, మిగతా పశువులకు ఈ నెల 14 వరకు పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రతీ పశు వైద్యశాల తమకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని, రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ సమావేశంలో సహాయ సంచాలకుడు డాక్టర్ బి.వెంకన్న, డాక్టర్ బి.రవిప్రసాద్, డాక్టర్లు నరేశ్, రవి, రవికుమార్, అర్జున్, నవీన్, సిబ్బంది నాగరాజు, మురళి, స్వప్న, రాజశేఖర్, పద్మ, రవి, బుచ్చిబాబు, గణేశ్ పాల్గొన్నారు.