సూర్యాపేటటౌన్, నవంబర్ 14 : రాష్ట్ర పుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్‌రెడ్డి, పి.స్వాతి, శీర్షిక బృందం పట్టణలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్స్ తయారీ కేంద్రాలపై గురువారం ఆకస్మిక దాడులు జరిపారు. ఎల్ఎస్ బేకరీ, కావేరీ గ్రాండ్ హోటల్, తనూస్ లోగిలి హోటల్, డాల్ఫిన్ బేకరీల్లో తనిఖీలు జరిపారు. వంట గదులు అపరిశుభ్రంగా ఉండడం, ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత పాటించకపోవడం, రూ.52వేల విలువైన కుళ్లిన మాంసం, చేప ఉత్పత్తులు, హానికర రంగులు కలిపిన చికెన్, చేపలు, తందూరి, గుడ్లు, నిల్వ ఉంచిన గోధుమ పిండిని గుర్తించి ధ్వంసం చేశారు. హోటళ్ల యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ టీం హెడ్ జ్మోతిర్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. పలు బేకరీల్లో నిల్వ ఉంచిన కేక్, బ్రెడ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బేకరీ యజమానులు ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ఉల్లంగించినందుకు నోటీసులు ఇచ్చి, శాంపిళ్లను సేకరించారు. ఈ సందర్భంగా జ్మోతిర్మయి మాట్లాడుతూ మరగబెట్టిన నూనెను పదే పదే వాడడంతో క్యాన్సర్ వస్తుందని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి హోటళ్లు, బేకరీలను సీజ్ చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.