– పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ
పెన్పహాడ్, జనవరి 07 : రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా మహోత్సవాలు ఏటా నిర్వహించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పి స్తున్నామన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను వెంట తీసుకెళ్లాలన్నారు. కండీషన్లో ఉన్న వాహనాలనే డ్రైవ్ చేయాలన్నారు. మద్యం సేవించడం, సెల్ఫోన్ చూడడం, నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నకిరేకంటి రవి. ఏఎస్ఐ రాములు, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, ఉపాద్యాయులు ఆనంద్, భాస్కర్, సైదులు, మీసాల నాగయ్య పాల్గొన్నారు.