కోదాడ, ఆగస్టు 8 : ఎడతెరిపి లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచికొట్టింది. దీంతో పలుచోట్ల వరద రోడ్లపైకి రావడం తో పట్టణ ప్రజలు, వాహనదారులు నరయాతన పడ్డారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువుకు వరద పెరిగింది. దీంతో కోదాడ, అనంతగిరి రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తండడంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు అగిపోయాయి. ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీ లేకపోవడం వల్ల వరద రహదారిపైకి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కోదాడ పెద్ద చెరువు అలుగు పోయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు వదర తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు కొనసాగించారు. గుడిబండ రోడ్డుపైకి వర్షపు నీరు రావడంతో అధికారులు, డివైడర్లను తొలగించాల్సి వచ్చింది.. లేకుంటే వరద నీరు ఇండ్లలోకి చేరీ ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు.. శిరిడీసాయి నగర్లో సైతం గుర్రపు డెక్క అడ్డుగా ఉండడంతో వరద రహదారిపైకి రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వారం రోజుల నుంచి కాలనీ వాసులు సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నంబాబు గుర్రపు డెక్క ఉన్న స్థలాన్ని పరిశీలించి విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే హుటాహుటిన సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగించకుండా చోద్యం చేస్తూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 1న వరద ఉధృతికి కోదాడలో లోతట్టు ప్రాంతాల ఇండ్లల్లోకి నీళ్లు చేరి ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే.. అయినా ము న్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
బీబీనగర్, ఆగస్టు 8: మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి ఉన్నప్పుడు వాగులు, వంతెనలపై డైవర్షన్ ఏర్పాట్లు చేయాలని, వాహనదారులను వంతెనలపై అనుమతించవద్దని యాదాద్రిభువనగిరి కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని వుద్రవెళ్లి వద్ద మూసీ వంతెనపై వెళ్తున్న వరద ఉధృతిని పరిశీలించారు. హైదరాబాద్‌లో కురిస్తున్న భారీ వర్షాలకు అధికారులను అప్రమత్తం చేసామన్నారు. జిల్లాలో ఎలాంటి నష్టం జరగలేదని, వర్షాలు ఆగిపోయే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. హిమాయత్ సాగర్ నుంచి నీటి విడదల చేసిన నేపధ్యంలో మూసీ ప్రవాహం పెరిగిందని, గురువారం రాత్రి వంతెనపై నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు రోడ్డును మూసీ వేశారన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెవెన్యూ యంత్రాంగం ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మూసీ వంతెన వద్ద ప్లాస్టిక్ సంచులు, వ్యర్థాలు, తూముల వద్ద అడ్డుగా వచ్చాయని, వాటిని క్లియర్ చేయాలన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పీహెచ్సీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ శ్యామ్ సుందర్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ దాసయ్య తదితర అధికారులు ఉన్నారు.
అర్వపల్లి, ఆగస్టు 8 : అర్వపల్లిలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలైన సంతకు వెళ్లే దారి, ప్రభుత్వ పశువుల దవాఖాన నీటిలో మునిగాయి. సూర్యాపేట, జనగాం, రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో వాహనాదారులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితమే కేజీబీవీని చుట్టూముట్టిన వరద నీటిని అధికారులకు వచ్చి పరిశీలించి తాత్కిలికంగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. మళ్లీ గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కేజీబీవీకి వెళ్లే దారి పూర్తిగా వర్షం నీటితో నిండింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తల్లిదండ్రులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను భుజా నపై ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లవల్సిన దుస్థితి ఏర్పడింది. పాఠశాలను అధికారులు సందర్శించారు.
చౌటప్పల్ రూరల్, ఆగస్టు 8: చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ పరిధిలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈదులవాగులో కారు కొట్టుకుపోయింది. గురువారం రాత్రి వర్కట్‌పల్లి గ్రామానికి చెందిన వారు చౌటుప్పల్ నుంచి వర్కుట్పల్లికి వెళ్లడానికి కారులో బయలుదేరారు. నేలపట్ల గ్రామ పరిధిలోని ఈదులవాగులో భారీ వర్షానికి నీటి ప్రవా హం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోతుండటంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నీటి ప్రవాహనికి కారు కొద్దిదూరం వాగులో కొట్టుకుపోయింది. తెల్లవారుజామున గ్రామస్తుల సహయంతో తాళ్లతో కారును ఒడ్డుకు తీశారు.
సూర్యాపేట, ఆగస్టు 8 (నమస్తే తెలగాణ): సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి వర్షం దంచి కొట్టింది. ఈ వర్షాకాలం సీజన్లోనే ఇది అతిపెద్ద వర్షం. వారం రోజులుగా ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతుండగా గురువారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి సుమారు గంటపాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని పలు ప్రాం తాల్లో గంటలోనే 9సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాం తాల్లో వీధులన్నీ జలమయం కావడంతోపాటు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో జన జీవనం స్థంభించింది. వర్షాకాలానికి సంబంధించి ప్రధానంగా గోదావరి ఆయకట్టులో పదిశాతం కూడా నాట్లు పడకపోగా ఈ వర్షం కాస్త ఊతమిచ్చినట్లేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల చెరువులు, కుంటల్లోకి కొంతమేర నీరు చేరింది.
సూర్యాపేట జిల్లాలోని అత్యధికంగా నడిగూడెం మండలంలో 9.7సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా తుంగతుర్తిలో అత్యల్పంగా 0.8 సెంటీమీటర్లు నమోదైంది. జిల్లాలో వర్షపాతం పరిశీలిస్తే జాజిరెడ్డిగూడెం 8.5, చివ్వెంల 7.6, నాగారం 7, చిలుకూరు 7, ఆత్మకూర్.ఎస్ 6.4, మఠంపల్లి 6.1, గరిడేపల్లి 6, చింతలపాలెం 5.9, సూర్యాపేట 5.7, నూతనకల్ 5.3, అనంతగిరి 5.2, మునగాల 5, మద్దిరాల 4.8, కోదాడ 4.2, మోతె 4, హుజూర్నగర్ 3.9, పెన్‌పహాడ్ 3.7, , నేరేడుచర్ల 3.7, తిరుమలగిరి 3.1 సెంటీ మీటర్లు నమోదు అత్యల్పంగా తుంగతుర్తిలో 0.8 సెంటీమీటర్లుగా నమోదైంది. జూన్, జూలై మాసల్లో ఏమాత్రం వర్షపాతం నమోదు కాకపోగా ఈ ఒక్క రోజులోనే కురిసిన భారీ వర్షానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.