నీలగిరి, ఏప్రిల్ 6 : కల్తీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చండూరు మండల కేంద్రానికి చెందిన ఎర్రజెల్ల రమేశ్, మహ్మద్ జానీపాషా, సాయం ఉపేంద్ర, కనగల్ మండలం జి.ఎడవెల్లికి చెందిన బొమ్మరబోయిన భార్గవ్, చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన జాల వెంకటేశ్పాటో మరో ఇద్దరు కలిసి కర్ణాటకకు చెందిన శ్రీనివాస్‌గౌడ్ ద్వారా ముడి సరుకు తెప్పించుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.
2019లో హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం తయారు చేసిన కేసులో మహ్మద్ జానీపాషాపై పలు కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల క్రితం శ్రీనివాస్‌గౌడ్‌కు జానీపాషా ఫోన్ చేసి ఎన్నికల్లో మద్యం ఎక్కువ సేల్ అవుతుందని, నకిలీ మద్యం తయారు చేసి ఇస్తానని చెప్పాడు. రూ.5లక్షలు అడ్వాన్స్ ఇస్తే రూ.10 లక్షల మద్యం తయారు చేసి ఇస్తానని ఎర్రజెల్ల రమేశ్, దోమలపల్లి యాదగిరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
తయారు చేసిన మద్యాన్ని నాంపల్లి మండల కేంద్రంలోని రమేశ్ తోటలో పెడుదామని నిర్ణయించుకున్నారు. జానీపాషా, రమేశ్, యాదగిరి, కర్ణాటకకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఫిబ్రవరి మొదటి వారంలో 5 డ్రమ్ముల స్పిరిట్ తీసుకువచ్చి తోటలో పెట్టారు. జానీపాషా, రమేశ్, యాదగిరి రూ.2 లక్షల చొప్పున రూ.6లక్షలు జమచేసి శ్రీనివాస్‌గౌడ్‌కు ఇచ్చారు. 10 లీటర్ల సామర్థ్యం గల 40 క్యాన్లలో శ్రీనివాస్‌గౌడ్ తెచ్చిన స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారుచేసి 20 లీటర్ల పరిమాణం గల 40 బబుల్స్‌లో మూడు రోజులు పులియబెట్టారు. ఆ తరువాత ఒక బబుల్‌ను రూ.10 వేలకు అమ్మాలని శ్రీనివాస్‌గౌడ్ చెప్పాడు.
మునుగోడులో వైన్‌షాప్ పార్ట్నర్ అయిన జాల వెంకటేశ్‌ను అడుగగా ప్యాకింగ్ సరిగ్గా లేదని, సరిగ్గా ఉంటే తీసుకుంటానని చెప్పాడు. జానీపాషా డ్రైవర్ సాయం ఉపేంద్ర కల్తీ మద్యం పలు ప్రదేశాలకు చేరవేసే క్రమంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకుని విచారించారు. కల్తీ మద్యం గుర్తించి కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
మరోవైపు చండూరు మండలం దుబ్బగూడెం గ్రామంలో ఒక గుడిసెలో నిందితులకు సంబంధించిన 20 బబుల్స్‌లో ఉన్న 400 లీటర్ల మద్యాన్ని స్వాధీనపర్చుకుని ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకున్న దేవరకొండ ఏఎస్పీ మౌనిక, టాస్క్‌ఫోర్స్ సీఐ ఎ.రమేశ్‌బాబు, ఎస్ఐలు మహేందర్, శివప్రసాద్, నాంపల్లి సర్కిల్ సీఐ శ్రీరాజు, ఎస్ఐ శోభన్‌బాబు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.