సూర్యాపేటసిటీ, జనవరి 10 : గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరి నుంచి రూ. 2.80 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన ఠాకూర్ నిఖిల్‌సింగ్, సారగండ్ల మహేశ్, రోహన్ రాజ్‌పుత్, కాలు తివారి జల్సాలకు అలావాటు పడి ఈజీ మనీ కోసం అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
ఈ నెల 5న జూమ్‌లో క్యాబ్ బుక్ చేసుకొని 20 కిలోల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్ర సరిహద్దులో పోలీసులు వాహనాల తనికీ చేస్తుండడంతో నాలుగు రోజుల పాటు అరకులోనే లాడ్జిలో బస చేశారు. ఈ నెల 9న రోహన్ రాజ్ పుట్, కాలు తివారీ బస్సులో హైదరాబాద్ వెళ్లగా ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్ కారులో గంజాయి తీసుకొని హుజూర్నగర్ మీదుగా హైదరాబాద్ బయల్దేరారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు వీరిని గుర్తించి గంజాయితో పాటు టాటా పంచ్ కారు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మరో కేసులో..
ఏపీకి చెందిన విజయ్‌కుమార్, బంగారు రాజు హైదరాబాద్‌లో హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. అయితే గంజాయికి అలవాటు పడి వైజాగ్ నుంచి మూడు నెలలకోసారి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మంగళవారం 1.5 కిలోల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వస్తుండగా నడిగూడెం వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. మరో కేసులో నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన పురం గణేశ్ కూలి చేస్తూ గంజాయికి అలవాటు పడ్డాడు. దాచేపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 800 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి గరిడేపల్లిలో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అనంతరం పోలీసు సిబ్బందికి రివార్డులు అందించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మునగాల సీఐ ఆంజనేయులు, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.