– నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర
నీలగిరి, మే11 : జనగణన–2027 తొలి దశ (Census–2027) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. “ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన” (House Listing & Housing Census) కార్యక్రమం నేటి నుండి నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇండ్ల గుర్తింపు, గృహాలకు క్రమ సంఖ్యలు కేటాయింపు, డోర్ నంబరింగ్, ఎన్యూమరేషన్ కార్యక్రమాలను ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్ చంద్ర స్వయంగా డివిజన్ నం.20, 21 & 22 ప్రాంతాలలో జరుగుతున్న హెచ్.ఎల్.బి. డోర్ నంబరింగ్, ఎన్యూమరేషన్ పనులను పరిశీలించారు. ఫీల్డ్ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించి, పనులు వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడే జనగణన కార్యక్రమానికి పట్టణ ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే ఆధారంగానే భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రూపకల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఆరోగ్య సేవలు, విద్యా సదుపాయాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు జరుగుతాయని తెలిపారు. అలాగే జనగణన కార్యక్రమం దేశ అభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, ప్రతి కుటుంబం బాధ్యతగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణవేణి, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ అఫీఫ్ ఉర్ రెహ్మాన్, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

‘జనగణన–2027 తొలి దశ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’