నీలగిరి/చండూరు, అక్టోబర్ 22 : మునుగోడు ఉప ఎన్నికను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ సూచించారు. ఉప ఎన్నిక ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. చండూరులోని డాన్‌బాస్కో కళాశాలలో ఈవీఎం యంత్రాల్లో బ్యాలెట్ పేపర్ సెట్ చేసే విధానం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని కోటయ్యగూడెంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వసతులను పరిశీలించి ఓటర్ స్లిప్పుల పంపిణీపై బీఎల్ఓను అడిగి తెలుసుకున్నారు. గూడపూరు, పలివెల గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
జమస్తాన్‌పల్లిలో ఫ్లయింగ్ స్కాడ్స్ సభ్యులతో మాట్లాడి వారి పని తీరును తెలుసుకున్నారు. అనంతరం చండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో సెట్ కాన్ఫరన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎన్నికల జనరల్ అబ్జర్వర్, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు ఈవీఎంలు, స్ట్రాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా, డబ్బు, మద్యం పంపిణీ జరుగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 3300 ద్వారా సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉప ఎన్నికకు 3,300 మంది పోలీసులు, 128 మందితో ఎక్సైజ్ టీమ్‌లు, 14 వీడియో అబ్జర్వర్లు, 9 ఎడిషనల్ టీమ్‌లు క్షేత్రస్థాయిలో పని చేస్తాయని వెల్లడించారు.