సూర్యాపేట, మార్చి 18 (నమస్తే తెలంగాణ)/పెన్‌పహాడ్ : ‘కండ్ల ఎదుట ఎండిన వరి చేలను చూసి దుఃఖంలో మునిగిన రైతులు ధైర్యంగా ఉండండి.. మీకు దన్నుగా నేనుంటా’నంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నదాతలకు భరోసానిచ్చారు. పెన్‌పహాడ్ మండలంలోని దుబ్బతండా, రేత్యాతండాల్లో వందల ఎకరాల్లో ఎండిపోయిన వరి పంటలను మంగళవారం మండుటెండలో ఆయన పరిశీలించారు. జగదీశ్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న గిరిజన రైతులు పెద్దఎత్తున చేరుకొని తమ గోడు వెల్లబోసుకున్నారు. కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో చెప్పినట్లు ఇస్తామన్నది ఒక్కటీ ఇవ్వకపోగా మీరిచ్చిన నీళ్లను కూడా మాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు పొలాల్లో నీళ్లు జాలువారితే ఇయ్యాల చుక్క నీరు లేక బోర్లు కూడా పోవడం లేదని వాపోయారు. పది ఎకరాలు ఉన్నా గింజ చేతికి రాకుండా ఎండిపోతున్నదని ఓ రైతు వేదన వ్యక్తం చేశారు.
ఎండలు బాగా కొడుతుండడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, గతం కంటే రైతులు ఎక్కువ విస్తీర్ణంతో పంటలు సాగు చేయడం వల్ల నీళ్లు చాలడం లేదని కాంగ్రెస్సోళ్లు కొత్త అబద్దాలు ఆడుతున్నారని, కేసీఆర్ హయాంలో ఎండలు లేవా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే వాస్తవాలు గిట్టని ప్రభుత్వం తనను బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిందని తెలిపారు. తనను ఏదో భయపెట్టాలని చూశారని, జగదీశ్‌రెడ్డి భయపడే వ్యక్తి కాదని, నిరంతరం ప్రజల తరపున పోరాటం చేసే నిఖార్సయిన ఉద్యమకారుడిని అని స్పష్టం చేశారు. యావత్ ప్రభుత్వం కుట్ర చేసి తనను అసెంబ్లీ నుంచి బయటకు పంపిందని పేర్కొన్నారు. ఇయ్యాల ఊళ్లు కల తప్పాయని, జనం మొహంలో నవ్వు మాయమైందని ఆదందోళన వ్యక్తం చేశారు. ఎవరు ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టడం, నిర్బంధాలతో భయపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. హామీల గురించి అడిగినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా బట్టలిప్పి కొడుతానంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి మాట్లాడడం దుర్మార్గమన్నారు. చివరకు బాధితుల గోడును ప్రసారం చేసే మీడియా ప్రతినిధులపైనా కేసులు పెట్టి జైలుకు పంపాడంటే ఏ స్థాయికి దిగజారాడో అర్థమవుతుందన్నారు. ‘నీకు ప్రజల బట్టలిప్పి కొట్టే హక్కు లేదు.. 420 హామీలు, ఆరు గారెంటీలు అని రాసిచ్చి అమలు చేయకుండా బాకీ పడ్డందుకు ప్రజలకే నీ బట్టలిప్పి కొట్టే హక్కు ఉంది. ప్రజలను, రైతులను బాధ పెడుతున్నావు.. వారి ఉసురు తగులుంది’ అంటూ హెచ్చరించారు. ఒక ప్రజా గొంతుకను నొక్కాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో లక్షల గొంతులు ప్రభుత్వంపై తిరిగుబాటు చేసేందుకు సిద్ధమవుతాయన్నారు.
అసెంబ్లీలో రైతులకు రుణమాఫీ చేశాం.. రైతు బంధు ఇచ్చాం… వడ్లకు బోనస్ ఇచ్చాం అంటూ చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చారు.. ఎవరికి ఇచ్చారో నిరూపించాలని అడిగితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని జగదీశ్‌రెడ్డి చెప్పుకొచ్చారు. రాత్రికి రాత్రి ఏమన్నా ఇచ్చిండ్రా ఏందని మీ వద్దకు వచ్చిన అని తెలపడంతో.. ‘ఎవడాడు మాకు ఇచ్చింది.. ఆనాడు కేసీఆర్ హయాంలో వచ్చినవి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందేం లేదు’ అంటూ రైతులు తేల్చిచెప్పారు. నీళ్లు రాక పొలాలన్నీ ఎండిపోయాయని, మిగిలిన కొద్దిపాటి పంటలైనా కాపాడుకోవాలని ఒక్క రేత్యాతండా పరిధిలోనే దాదాపు 300 బోర్లు వేసినా, ఫలితం లేకుండా పోయిందని రైతులు తెలిపారు.
ప్రస్తుత కరువు పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో ఏర్పడినవేనని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఎండిన పంటలను ఆయన చూపుతూ పలువురు రైతులు తమకు ఆత్మహత్యే శరణ్యమని నిస్సహాయ స్థితిని వ్యక్తం చేయగా.. ‘అలాంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దు.. ఈ సీజన్లో పంట పోయింది. మళ్లీ వచ్చే సీజన్ ఉంటుంది. అందరం కలిసి నీళ్లు ఎందుకు ఇవ్వరో పోరాడుదాం. ఎన్నో పోరాటాలు చేశాం.. పెద్దపెద్దోళ్లు అనుకున్న వాళ్లనే మట్టి కరిపించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.. ఇవ్వాల రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లు ఒక లెక్కా! మీరు ధైర్యంగా ఉండండి.. నేను అండగా ఉంటా’నంటూ జగదీశ్‌రెడ్డి ధైర్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అప్పగిస్తే మూడో రోజే పంట పొలాల్లోకి నీళ్లు తెస్తామని నెల కిందటే చెప్పినా.. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందన లేకుండా పంటలను ఎండబెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిన ప్రతి ఎకరాకూ పరిహారంగా ప్రభుత్వం రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగంధర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, సింగిల్ విండో చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతల జానకిరాంరెడ్డి, జిల్లా నాయకులు ఇంద్ర సేనారావు, వెంకటేశ్వర్లు, నాగేశ్వర్రావు, గోపి, శ్రీనివాస్, సుధాకర్, జగన్ ఉన్నారు.
నాకున్న ఎనిమిదెకరాల్లో ఆరెకరాలు నాటు పెట్టిన. ప్రభుత్వం వారబందీ లెక్క నీళ్లు ఇస్తామంటే నమ్మి సాగు చేసిన. పంటకు సరిగా నీరందక పొలం నెర్రలిచ్చింది. పంట మొత్తం ఎండిపోయింది. రైతుబంధు పైసలు రాక పోవడంతో వ్యాపారుల వద్ద అప్పు తెచ్చిన. చేతికొచ్చిన పంట నీళ్లు లేక దక్కకుండా పోయింది. ఇక అప్పులే మిగిలాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనిమిదెకరాలు సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చింది. ఈ సారి మాత్రం ఆగమైంది.
-భూక్యా వెంకన్న, రైతు, మేగ్యతండా ఆవాసం, రేత్యాతండా, పెన్‌పహాడ్ మండలం
నేను నాలుగు ఎకరాల్లో వరి వేసిన. మొత్తం పిందె పోసుకుంది. ఇంకో రెండు తడులైతే పంట చేతికొచ్చేది. ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు రాక పంట మొత్తం ఎండి పోయింది. మా కష్టం ఎవలకు చెప్పుకోవల్నో అర్థమైత లేదు. మా ఊళ్ల 80 శాతం పంటలు నీళ్లు ఎండిపోయినయి. నీళ్లు ఇస్తరనే నమ్మకంతోనే పంటలు సాగు చేస్తే ప్రభుత్వం మోసం చేసింది. గతంలో కాల్వకు నీళ్లు వస్తే చెరువు నింపినం. దాని వల్ల బావులు, బోర్లల్లో నీళ్లు పెరిగినయి. అప్పుడు కరువన్న ముచ్చటే లేకుండే. ఐదు కిలోమీటర్ల నుంచి సొంత డబ్బులు పెట్టి కాల్వ తీపించినం. కానీ ఇప్పుడు కాల్వలో నీళ్లు రావడం లేదు.
-నునావత్ పద్మ, రైతు, దుబ్బతండా, పెన్‌పహాడ్ మండలం