చివ్వెంల, జూన్ 23 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులో 65 జాతీయ రహదారి వెంట ఉన్న ఐస్‌క్రీమ్ కప్పులు తయారు చేసే కంపెనీలో ఆదివారం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ముడిసరుకు, మిషనరీ పూర్తి గా కాలిపోగా రూ.1.50 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు యాజమాన్యం తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్‌పల్లి శివారులో ఉన్న జయశంకర్ పాలిమర్స్ కంపెనీలో ఐస్‌క్రీమ్స్ కప్పులు(ప్లాస్టిక్) తయారు చేస్తారు.
ఉదయం 8 గంటల సమయంలో షార్ట్ సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. కంపెనీ సమీపంలోని క్వార్టర్స్‌లో నివాసముంటున్న వాచ్‌మన్ గమనించి విషయాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కంపెనీ యజమాని యలగందుల సిద్ధార్థకు ఫోన్‌ద్వారా సమాచారం అందించాడు. ఆయన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఫైరింజన్లోని నీళ్లు అయిపోయినా మంటలు అదుపులోకి రాక పోవడంతో మరో ఆధునిక వాహనాన్ని తెప్పించి ఫోమ్ ద్వారా మంటలను ఆర్పివేశారు. కంపెనీ గోదాములో ఉన్న 40 టన్నుల ముడి సరుకుతో పాటు, తయారు చేసిన కప్పులు, రెండు యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రేకులతో వేసిన గోదాము కూడా పూర్తిగా ధ్వంసమైంది. కంపెనీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కనకరత్నం తెలిపారు.