చర్లపల్లి/మద్దిరాల, ఏప్రిల్ 16 : పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబాన్ని చూసి విధి తట్టుకోలేకపోయింది. గాఢ నిద్రలో ఉన్న భార్యాభర్తలను, చిన్నారిని ఊపిరాడకుండా చేసి కబలించేసింది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ కుషాయిగూడలో ఈ హృదయవిధారక సంఘటన చోటుచేసుకున్నది. అగ్నికి ఆహుతై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో కుషాయిగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రెట్నేని జన్నయ్య-భద్రమ్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కూలీనాలి చేస్తూ జీవనం సాగిస్తూ అందరి వివాహాలు చేశారు. కుమారుడు నరేశ్(36)కు తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన సుమ(30)తో తొమ్మిదేండ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు హాత్విక్(7), జశ్విత్(5) ఉన్నారు. నరేశ్ జీవనోపాధి కోసం భార్యాపిల్లలతో కలిసి నగరానికి వచ్చి కుషాయిగూడలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. నరేశ్ హెచ్‌పీ గ్యాస్ వాహనం నడుపుతుండగా, సుమ గృహిణి. అయితే శనివారం సాయంత్రం నరేశ్ పెద్ద కుమారుడు హాత్విక్ మేనత్త ఇంటికి వెళ్లగా.. నరేశ్, భార్య సుమ, చిన్న కుమారుడు జశ్విత్తో కలిసి రూములో నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో వారు ఉంటున్న అపార్ట్మెంట్ పక్కన ఉన్న టింబర్ డిపోలో మంటలు ఏర్పడి ఒక్కసారిగా అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టాయి. ఆ వెంటనే రెండో అంతస్తులో ఉండే నరేశ్ రూములోకి మంటలు చేరాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కిందికి దిగే ప్రయత్నంలో మెట్లపైనే నరేశ్, భార్య సుమ, కొడుకు జశ్విత్ మంటల్లో సజీవదహనం అయ్యారు. తెల్లవారుజామున నిద్రనుంచి లేచిన హాత్విక్ అగ్నిప్రమాదంలో తల్లిదండ్రులు, సోదరి ఆగ్నికి ఆహుతయ్యారని తెలియక అమ్మా నాన్న ఎటో పోయారని ఏడవడాన్ని చూసిన స్థానికులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇదిలా ఉండగా భవనంలోని అదే అంతస్తులో ఉండే నారాయణ(55), అతడి భార్య ఉమాదేవి(48), వాచ్‌మన్ వీర మల్లేశ్(50), పద్మ(40)లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వైద్యశాలకు తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని చుట్టు పక్కల భవనాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. సంఘటన స్థలానికి చెరుకున్న డీఆర్ఎఫ్ డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ రాజు, మల్కాజిగిరి డీసీపీ జానకీ, కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఆశోక్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.
కాప్రా సర్కిల్, చర్లపల్లి డివిజన్ సాయినగర్‌లో నివాసముండే శివసాయి ఉదయ్‌శంకర్ గత కొంత కాలంగా సాయినగర్ ప్రధాన రహదారిపై శివసాయి టింబర్ డిపో నడుపుతున్నాడు. కాగా ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు టింబర్ డిపో పక్కనే ఉన్న భవాన్ని చుట్టుముట్టాయి.
బాధిత కుటుంబాలకు రూ.45లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనలో మృతిచెందిన కుటుంబానికి జాతీయ విపత్తుల విభాగం నుంచి మృతులలో ఒక్కోక్కరికి నాలుగు లక్షలు, జీహెచ్ఎంసీ తరుఫున రూ.6లక్షలు, రెవెన్యూ అధికారుల తరుఫున రూ.లక్షా50వేలు, టింబర్ డిపో యజమాని తరుఫు రూ.25 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం మరో రూ.25వేలు టింబర్ డిపో యజమాని చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సొంతంగా రూ.50వేలు, ఉప్పల్ నియోజకవర్గం మున్నురు కాపు ఇన్చార్జి గంధం నాగేశ్వర్రావు రూ.50వేలు, మృతి చెందిన కుటుంబానికి తక్షణ సహాయం కింద మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు.