కోదాడ, అక్టోబర్ 22 : విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అదే నెలలో చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సాధన కమిటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొనుగోటి కోటయ్య డిమాండ్ చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో 2024 తర్వాత రిటైర్ అయి బెనిఫిట్స్ మంజూరు కాక ఆందోళనలతో మృతి చెందిన ఉద్యోగుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించి, బాలుర ఉన్నత పాఠశాల నుండి రాజీవ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలను వెంటనే మంజూరు చేయకపోవడం మూలంగా కుమార్తెల వివాహాలకు, అనారోగ్య సమస్యల ఖర్చులకు, కుటుంబ అప్పులకు డబ్బులు అందక రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది మనో వేదనకు గురై మృతి చెందుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే బడ్జెట్ మంజూరు చేసి రిటైర్ అయిన ఉద్యోగులందరి ప్రయోజనాలను వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఉచితంగా నగదు రహిత వైద్య సేవలు అమలు చేయడంతో పాటు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆర్థిక ప్రయోజనాలు అందక ఆందోళన చెంది ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని తామంతా అండగా నిలబడతామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ కోదాడ డివిజన్ బాధ్యుడు షేక్ బాలేమియా, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనెపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి రఘువర ప్రసాద్, భద్రారెడ్డి, హుస్సేన్, మణిరం, రమేశ్ బాబు, భిక్షం, భ్రమరాంబ పాల్గొన్నారు.
Kodada : ‘రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలి’