దళితుల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేసి పలు యూనిట్ల ఏర్పాటు ద్వారా ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తున్నది. ఇప్పటికే ఒక విడుత పూర్తి కాగా రెండో విడుత పంపిణీకి సన్నద్ధమవుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి విడుతగా నియోజకవర్గానికి 100 మంది చొప్పున 1,200 మందికి యూనిట్లు అందజేసింది. రెండో విడుతలో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున ఉమ్మడి జిల్లాలో 13,200 మందికి సాయం చేయాలని సర్కారు నిర్ణయించగా, కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ వారంలో లబ్ధిదారుల జాబితా విడుదల చేసి ఈ నెలాఖరులోగా యూనిట్లు గ్రౌండింగ్ చేయనున్నారు.
నల్లగొండ, ఆగస్టు 2 : దళిత బంధు రెండో విడుత ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో అధికార యంత్రాగం కలెక్టర్ల పర్యవేక్షణలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విధివిధానాలు సిద్ధ్దం చేసి లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ సారి 1,100 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని నిర్ణయించింది. తొలి విడుత వంద కుటుంబాలకు ఇవ్వగా ఈ సారి 11 రెట్లు పెంచి అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నది. ఈ తరహాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజక వర్గాల్లో 1100 చొప్పున మొత్తంగా 13,200 కుటుంబాలకు ఈ దళిత బంధు ఈ సారి అందనుంది. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఈసారి ఉమ్మడి జిల్లాకు దళిత బంధు పథకం కింద రూ.1,320 కోట్లు కేటాయించింది.
తుది దశలో లబ్ధిదారుల ఎంపిక..
దళిత బంధు పథకంలో లబ్ధ్దిదారుల ఎంపికను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకే బాధ్యతను అప్పగించింది. దాంతో వారు ఆయా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల సహకారంతో లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ఎంపిక కార్యక్రమం కొనసాగి చివరి దశకు వచ్చింది. ఈ వారంలో లబ్ధ్దిదారుల ఎంపిక పూర్తి కానుండగా ఈ నెల చివరి లోగానే గ్రౌండింగ్ చేయనున్నారు. అయితే ఆర్థిక శాఖ ఆమోదంతో రాష్ట్ర అధికార యంత్రాంగం గతంలో ఉన్న జరిగిన తప్పొప్పులను దృష్టిలో పెట్టుకొని కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది. గతంలో లాగానే లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఇస్తూ కలెక్టర్ల స్వీయ పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం ద్వారా ఈ సారి కూడా అర్హులైన లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తున్నారు.
బ్యాంకులతో సంబంధం లేకుండానే…
దళిత బంధు రెండో విడుతలో భాగంగా ప్రతి నియోజక వర్గంలో 1,100 కుటుంబాలను ఎంపిక చేయాలని యోచించిన సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తూ అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నది. అయితే కలెక్టర్ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పోరేషన్ యంత్రాంగం ద్వారా ఎలాంటి బ్యాంకు లింకేజీలు లేకుండా నేరుగా లభ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.రూ.10 లక్షల్లో రూ.9.90లక్షల ఇచ్చి మిగిలిన రూ.10 వేలకు మరో రూ.10 వేలు జత చేసి ఆ లబ్ధ్దిదారుడి ఖాతాలోనే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉంచనున్నారు.
ఆర్థ్దిక స్వావలంబన దిశగా గత లబ్ధిదారులు..
దళిత బంధు కింద ఉమ్మడి జిల్లాలో గతేడాది 1,200 మందికి ఈ పథకం కింద డబ్బులు రాగా అందులో మెజార్ట్టీ కుటుంబాలు కార్లు, వ్యవసాయ ట్రాక్టర్లు, వరికోత మిషన్లు, డీసీఎంలు తీసుకోగా మరికొందరు ఫౌల్ట్రీ, డెయిరీ, కిరాణం లాంటి దుకాణాలు, హోటళ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తూ మంచి లాభాలు సాధిస్తున్నారు. ఈ విషయాలు క్షేత్ర స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగంతో పాటు కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధుల పరిశీలించి ఫలితాలు చూడడంతో ప్రభుత్వం ఈ సారి మరింత మందికి దళిత బంధు అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నది.
లబ్ధిదారుల ఎంపిక తుది దశలో ఉంది
రెండో విడుతకు సంబంధించి లబ్ధ్దిదారుల ఎంపిక తుది దశకు చేరుకుంది. గత విడుతలో ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని యూనిట్లు గ్రౌండింగ్ చేసి క్షేత్ర స్థ్దాయిలోకి వెళ్లి పరిశీలించాం. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగైంది. గతంలో కూలీలుగా పని చేసిన వారు ప్రస్తుతం వారి పని వారే చేసుకోని జీవిస్తున్నారు. అయితే రెండో విడతలో కూడా లబ్ధ్దిదారులకు యూనిట్లు ఇచ్చిన తర్వాత గ్రౌండింగ్ చేసి ప్రభుత్వ నిదులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
-ఎల్.శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి, నల్లగొండ