
నల్లగొండ, జనవరి 10 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి కేటాయించిన జానపద కళాక్షేత్రం స్థలంలో శాశ్వత ప్రాతిపదికన హెలిప్యాడ్ నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి దారి, హెలిప్యాడ్ స్థలంలో వర్షపు నీరు నిల్వకుండా డ్రైనేజీ నిర్మించాలని మున్సిపల్ యంత్రాంగాన్ని ఆదేశించారు. అదేవిధంగా అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసి హెలిప్యాడ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. క్లాక్‌టవర్ వద్ద టౌన్‌హాల్ నిర్మాణం చేయాల్సి ఉన్నందున ఐబీ, ఆర్అండ్బీ కార్యాలయాలను తాత్కాలికంగా మార్చాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు. పాత జడ్పీ కార్యాలయంలోకి ఐబీ, ఇంజినీరింగ్ కార్యాలయాలు షిఫ్ట్ చేయాల్సి ఉన్నందున తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నారు.
ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని కలెక్టర్, ఎమ్మెల్యే సూచించారు. హాస్టళ్లకు బీటీ, అప్రోచ్ రోడ్లు వేయాలని, దోమలు రాకుండా మెష్‌తో కిటికీలు ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కిచెన్, డైనింగ్ మధ్య పార్టీషన్ చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, ఆర్అండ్బీ ఎస్ఈ నర్సింహ, డీఈ నరేందర్, సర్వే ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్, కమిషనర్ రమణాచారి, పీఆర్ ఈఈ తిరుపతయ్య, డీఈ నాగయ్య ఉన్నారు.