నేరేడుచర్ల, జూన్ 02 : భూసార పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు, మందులు వాడి అధిక దిగుబడులు పొందాలని భారతీయ వ్యవసాయ వరి పరిశోధన స్ధానం సైంటిస్ట్ సీహెచ్ పద్మావతి రైతులకు సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంలో భాగంగా సోమవారం నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల రైతు వేదికలో రైతులకు అవగాహాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరి పంటలో సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తే చీడ పీడల ఉధృతి తగ్గించవచ్చన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
గడ్డిపల్లి కేవికే సీనియర్ సైంటిస్ట్ హెడ్ ఇన్చార్జి డి.నరేశ్ మాట్లాడుతూ.. రైతులకు భూసార పరీక్షకి మట్టిని సేకరించే విధానం, వివిద రకాల జీవన ఎరువుల వాడటం వల్ల ఉపయోగం, రైతులకు కలిగే లాభాలను వివరించారు. ఎరువులు ఒకే దఫా కాకుండా మూడు లేదా నాలుగు దఫాలుగా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ జావీద్, ఏఈఓలు అన్వేశ్, ఇఫ్కో ప్రతినిధి శరత్, రైతులు పాల్గొన్నారు.