నేరేడుచర్ల, మే 09 : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని గ్రంథాలయం వీధిలో వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి బంగారపు గొలుసును అపహరించిన మహిళా దొంగను 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్నగర్ సీఐ చరమందరాజు తెలిపారు. శుక్రవారం నేరేడుచర్లలో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని 11వ వార్డులో ఉంటున్న గుండా చంద్రకళ ఇంట్లోకి వచ్చిన మహిళ మంచినీళ్లు అడిగి ఆమెతో మాటలు కలిపింది.
ఆమె మెడలో ఉన్న బంగారపు గొలుసును చూసి కళ్లలో కారం కొట్టి రెండు తులాల బంగారపు పుస్తెలతాడును దొంగలించింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టణంలోని హుజూర్నగర్ బస్టాప్ వద్ద అనుమానాస్పందంగా అమారారపు మంజుల కనిపించింది. దీంతో ఆమెను మహిళా పోలీసులు తనిఖీ చేయగా బంగారు గొలుసు లభించింది. విచారించగా వృద్ధురాలు చంద్రకళ మెడలో దొంగిలించినట్లు అంగీకరించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.