యాదగిరిగుట్ట/మోటకొండూర్, జూలై 8: మోటకొండూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నచ్చితే ఒకతీరు.. నచ్చకపోతే మరోతీరుగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతున్నది. భూమండ్ల బాల నర్సయ్య అనే వ్యక్తి భూమి విషయంలో అదే జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూ కబ్జాకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధితుడు బాల నర్సయ్య కుమారుడు భూమండ్ల మహే శ్ ఆరోపిస్తున్నారు. భూమిపైకి ఎస్సై వెళ్లిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. మోటకొండూర్ ఎస్సై అశోక్ భూమి వద్దకు వెళ్లి సెటిల్మెంట్ చేస్తున్నాడని మహేశ్ పేర్కొన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎస్సై వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా లాభం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని బాధితుడు మహేశ్ సోషల్ మీడియా వేదికగా వివరించాడు.
ఆత్మహత్యాయత్నం..
ఎస్సై వేధింపులకు తాళలేక తన తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుమారుడు మహేశ్ చేసి న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమకు రావాల్సిన 20 గంటల భూమి కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. తమ భూమిని కబ్జా చేసిన వారికే మోటకొండూర్ పోలీసులు అండగా నిలుస్తూ తమను చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు మండల కేంద్రానికి చెందిన రైతు భూమండ్ల మల్లమ్మ కుమారుడు మహేశ్ చెప్పుకొచ్చారు. భూమి వ్యవహారంలో పోలీసులు అత్యుత్సా హం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కు రావాల్సిన భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే పోలీసులు క్రిమినల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
పోలీసులు వేధింపులతో విసుగుచెందిన తన తల్లి భూమండ్ల మల్లమ్మ మంగళవారం పోలీసుల సమక్షంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. దీం తో భువనగిరి ప్రభుత్వ దవాఖానలో చికిత్స నిమిత్తం చేర్పించామని, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిపారు. మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం మోటకొండూర్ నుంచి మేడికుంటపల్లి వెళ్లే దారి పక్కనే ఉన్న సర్వే నంబర్ 58లో భూమండ్ల బాల నర్సయ్య పేరిట 1.38 ఎకరాల పట్టా భూమి ఉంది. కబ్జాలో మాత్రం కేవలం 1.18 ఎకరాలే ఉన్నట్లుగా ఉంది. మరో 20 గుంటల భూమి కోసం 2023లో సర్వే చేసేందుకు చలాన్ కట్టారు.
అప్పటి జిల్లా సర్వే అధికారి 2024 ఫిబ్రవరి 24 పంచనామా చేసి హద్దురాళ్లు పాతారు. అదే సర్వే నంబర్లో భువనగిరి మండలం గూడూరుకు కొంతం ఆండాలు సుమారుగా 5 ఎకరాల భూమి కొనుగోలు చేయడంతో పాటు తమ భూమి హద్దురాళ్లను కూడా తీసివేసిందన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ మొదలైందని దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేయగా పోలీసులు కొంతం అండాలు మాట విని, తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని మహేశ్ తెలిపారు.
రెవెన్యూ అధికారుల నివేదికలు, భూమి హద్దులను పరిగణలోకి తీసుకోకుండా ఎస్సై ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమపై వత్తిడి తెస్తున్నారన్నారు. తమ భూమి హద్దులను ఇతరులు అక్రమంగా మారుస్తున్నారని ఫిర్యాదు చేసినా ఎస్పై పట్టించుకోలేదన్నారు. మోటకొండూర్‌కు చెందిన కొంత మంది వత్తిడితోనే తమ కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి, ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. డీఐ ఇచ్చిన పంచనామాను పరిగణనలోకి తీసుకోకుండా తనను, తమ కుటుంబ సభ్యులను ఎస్పై మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు.
ప్రస్తుతం తన తల్లి పరిస్థితి విషమంగా ఉం దని, ఆమెకు ఏదైనా జరిగితే ఎస్సై దే పూర్తి బాధ్యత అన్నారు. దీనిపై ఎస్సై అశోక్‌కుమార్‌ను వివరణ కోరగా ఈ వివాదంలో భూ మండ్ల బాల నర్సయ్యదే వంద శాతం తప్పన్నారు. కొంతం అండాలు భూమి కొనుగోలు సమయంలోనే హద్దురాళ్లు వేసుకుందన్నారు. ఆమెకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందన్నారు. పరిస్థితి సద్దుమణిగేందుకే భూ మిపైకి వెళ్లామన్నారు. భూమం డ్ల బాల నర్స య్య కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేశామన్నారు. ఇది సివిల్ వ్యవహారం కాదని, క్రిమినల్ కేసు అని, అందుకే ఫీల్డ్ మీదకి వెళ్లామని ఎస్సై వివరించారు.