చిట్యాల, ఏప్రిల్ 12 : కూతురు కులాంతర వివాహం చేసుకుందని పురుగుల మందు తాగిన తండ్రి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాలలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు. చిట్యాలకు చెందిన రేముడాల గట్టయ్య((49) కూతురు నెలక్రితం అదే గ్రామానికి చెందిన వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. అతడితో ఇంట్లోంచి వెళ్లిపోయింది. కూతురు కనిపించడం లేదని గట్టయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తదుపరి వారిరువురు వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో మనస్థాపం చెందిన గట్టయ్య ఈనెల 10న పురుగుల మందు తాగగా చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గట్టయ్య శనివారం మృతి చెందాడు. కాగా పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే గట్టయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.