ఇటీవల కురిసిన భారీ వర్షాలు సూర్యాపేట జిల్లాలో భారీ నష్టాన్ని కలిగించాయి. కాల్వలు, చెరువులకు గండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసి నిరాశ్రయులయ్యారు. రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. వరద నష్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజలు ఇప్పుడే తేరుకొని పరిస్థితి కనిపించడం లేదు.
మద్దిరాల సెప్టెంబర్ 3 : మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు మద్దిరాల మండలాన్ని కుదిపే శాయి. వరదలతో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పోలుమల్ల సమీపంలోని జాతీయ రహదారి 365పై రోడ్డు కోతకు గురైంది. చందుపట్లలోని పెద్దచెరువు కట్టకు గండిపడి వరి పొలాలు నీట మునిగాయి. మామిండ్ల మడవ గ్రామంలోని బంజేరు కుంటలోకి భారీగా నీరు చేరడంతో పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ కొంతమేర ముంపునకు గురైంది. ఇండ్లలోకి చేరిన నీటితో నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. దీంతో నీటిని కాల్వ తీసి కిందికి విడిచిపెట్టారు. వర్షానికి 19 పాత ఇండ్లు కూలిపోయాయి. చౌవుల్లతండా ఆవాసం రాజానాయక్ తండాలో బాదవత్ బీబీ ఐదు ఎకరాల్లో పెసర పంట కోయడానికి సిద్ధంగా ఉండగా వర్షానికి పంట మొత్తం నేలకొరిగి రంగు మారింది. నోటికాడికి వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు బోరున విలపించారు. కాయ దశలో ఉన్న పత్తి పంటలు సైతం నేలకొరిగాయి. వరదల వల్ల వరి పంటల్లో ఇసుక మేటలు వేశాయి. మండలంలో సుమారు వెయ్యి నుంచి 1200 ఎకరాల పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా. చెరువులు, కుంటల పక్క ఉన్న కొన్ని వందల ఎకరాల వరి పంటలు కూడా నీట మునిగాయి.
మేము ఐదెకరాల్లో పెసర పంట వేసిన. చేను కోయడానికి మిషన్లు అందుబాటులో లేక వాటి కోసం చూస్తున్న సమయంలో భారీ వర్షం పంటను నాశనం చేసింది. ఐదెకరాల చేను మొత్తం నీట తడిసి రంగు మారింది. ఇప్పుడు దాన్ని కోయలేము. అలాగని కూలీలతో ఏరించడం సాధ్యం కాదు. మా బాధ ఎవరికీ రావొద్దు.
– బాదవత్ బీబీ, రాజానాయక్ తండా, చౌవుల్లతండా గ్రామం, మద్దిరాల మండలం
మా గ్రామంలోని బంజేరు కుంటలోకి మునుపెన్నడూ లేనివిధంగా భారీ వరద వచ్చింది. కుంట నిండటంతో ఇండ్లళ్లకు నీళ్లు వచ్చాయి. ఒక్కసారిగా వచ్చిన వరదతో ఇంట్లోని నిత్యావసర వస్తువులు తడిసిపోయి. చాలా నష్టం కలిగింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– ఏర్పుల గణేశ్, మామిండ్లమడవ, మద్దిరాల మండలం
అర్వపల్లి : మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం కలిగింది. సుమారు 400ఎకరాల్లో పంటలు నీట మునిగాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. పంట నష్టంపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. వర్షంతో మూడు ఇండ్లు పాక్షకంగా దెబ్బతిన్నట్లు తాసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఏఈ శ్రీకాంత్ విద్యుత్ సిబ్బందితో గ్రామాల్లో తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. పలుచోట్ల ఎస్సారెస్పీ కాల్వలు కోతకు గురయ్యాయి.
నేను ఐదెకరాలు కౌలుకు తీసుకొని జాజిరెడ్డిగూడెం శివారులోని కేశవాపురం చెరువు సమీపంలో వరి సాగు చేస్తున్నా. ఇటీవల కురిసిన భారీ వర్షంతో నాటు పెట్టిన ఐదెకరాలు పూర్తిగా నీటి మునిగింది. రెండు లక్షల వరకు నష్టం వాటిల్లింది. అప్పు తెచ్చి కౌలు చేసుకుంటే ఇలా జరుగడం చాలా బాధగా ఉన్నది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
-శిగ రవి, కౌలు రైతుల, జాజిరెడ్డిగూడెం
అనంతగిరి : మండల పరిధిలోని పాలేరు నది ఉగ్రరూపానికి అనంతగిరి మండలం కిష్టాపురం గ్రామం అతలాకుతలమైంది. శనివారం అర్ధరాత్రి గ్రామంలోకి వచ్చిన వరద క్షణాలోనే ఇండ్లను ముంపునకు గురిచేసింది. గ్రామస్తులు అంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని భూమి పట్టాలు, సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి. బియ్యం, సరుకులు, బట్టలు, తడిసి ముద్దయ్యాయి. ముసలివాళ్లు రెండు రోజులుగా వణికిపోతున్నారు. గ్రామంలో సుమారు 200 కుటుంబాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. పుట్టిన దగ్గరి నుంచి ఇలాం టి వరదను చూడలేదని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
భారీ వర్షంతో వరదలకు మామిళ్ల చెరువు కట్ట తెగి పంటలకు తీవ్రం నష్టం కలిగింది. చెరువు కింద మాది ఐదెకరాల వరిపొలం కొట్టుకుపోయింది. పొలం మొత్తం రాళ్లుతేలింది. 25లక్షల నష్టం వాటిల్లింది. ఐదెరాల పరిధిలో మాకు ఉన్న రెండు బావులు వరద మట్టితో పూడిపోయాయి. గత సంవత్సరం పంట నష్టపోయి అప్పులు చేసినం. ఈ ఏడాది వరదతో మొత్తం నష్టపోయాం. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి ఆదుకోవాలి.
-కాసాని మల్లేశ్, రైతు, మఠంపల్లి మండల కేంద్రం
మేళ్లచెర్వు : భారీ వర్షానికి మేళ్వచెర్వు మండలంలో సుమారు 700 ఎకరాల్లో వరి, 1200 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. పలు చోట్ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. నీటి ప్రవాహానికి మోటర్లు కొట్టుకొని పోయాయి. మండల కేంద్రంలోని నాగుల చెరువు, కందిబండ ఊరచెరువు, వెంకట్రాంపురం చెరువులు తెగి సమీపంలోని పంట పొలాల్లోకి నీరు చేరింది. దీంతో సమీపంలోని రోడ్లు కోతకు గురై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కందిబండ శివారులోని బ్రిడ్జి కూలడంతో మేళ్లచెర్వు నుంచి కోదాడకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర వ్యయప్రయాసలకు గురవుతున్నారు.
వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మండల కేంద్రం నుంచి ఎర్రగట్టుతండా, వెంకట్రాంపురం వెళ్లే దారి కోతకు గురై బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తున్నది. ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకునే అవకాశం కూడా లేదు. వెంటనే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి.
-బాణోతు రఘునాథ్, డ్రైవర్, ఎర్రగట్టుతండా, మేళ్లచెర్వు
వరద నీటితో ఇంట్లోని సామాన్లు పూర్తిగా తడిసిపోయాయి. నిత్యావసర వస్తువులు వరదకు కొట్టుకుపోయాయి. బియ్యం, వడ్లు పూర్తిగా తడిసినయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తప్ప అధికారులు ఎవ్వరూ రాలేదు. వివరాలు తెలుసుకోలేదు.
-ఎస్కే బాజీ, కూచిపూడి, కోదాడ మండలం