కట్టంగూర్, మార్చి 26 : కరువుతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామంలో ఎండిపోయిన వరి పొలాలను పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరువుతో వందలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోవడంతో రైతులు ఆర్తనాదాలు పెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసి నది నీటితో చెరువులు, కుంటలను నింపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటిని సముద్ర పాలు చేసిందన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీరుతో పాటు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను రాజులు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో తీవ్ర కరువు ఏర్పడిందన్నారు. ఎండిపోయిన పొలాలను వ్యవసాయ అధికారులు తక్షణమే పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి పరిహారాన్ని అందించాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ఊట్కూరు ఏడుకొండలు, మాజీ సర్పంచ్ ముప్పిడి యాదయ్య, నాయకులు చిట్యాల రాజిరెడ్డి, గుండాల మల్లేశ్, మేకల రమేశ్, ఊట్కూరి భిక్షం, చిట్టిమల్ల నర్సింహ, నిమ్మనుకోటి శివ, పాదూరి శిశుపాల్ రెడ్డి, తండు సోములు, లింగయ్య, శంకరయ్య, యాదయ్య పాల్గొన్నారు.