– నెల రోజులు గడిచినా రైతుల అకౌంట్లలో పడని పైకం
.
పెన్పహాడ్, మే 26 : ధాన్యం కాంట వేసిన 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించింది. నెల రోజులు గడుస్తున్నా డబ్బులందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన నారాయణ గూడెం సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రంలో హాని రైస్ మిల్లుకు 200 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మండల పరిధిలోని మాచారంలోని హని రైస్ మిల్లుకు అలాట్ కావడంతో ధాన్యం ఎగుమతి చేశారు. ధాన్యం కాంటలు వేసి నెల రోజులు గడుస్తున్నా మిల్లు నుండి ట్రక్ షీట్ ఇంత వరకు రాకపోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కాంట వేసిన 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం అంటూ గొప్పలు చెపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నెల రోజులు దాటినా డబ్బు రావడం లేదు. దీంతో రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు వారం రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించనుండటంతో ఎరువులు, విత్తనాలకు డబ్బుల్లేక రైతులు పాలుపోని స్థితిని ఎదుర్కొంటున్నారు.
ధాన్యం అమ్మిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా పెట్టి 20 రోజులకు పైగా అయ్యింది. 24 గంటల్లో డబ్బులను ఖాతాల్లో వేస్తామన్నారు. 24 రోజులైనా వేయడం లేదు. ఎవరికి ఫోన్ చేసినా స్పందించడం లేదు. రైతులకు విత్తనం వేసిన నాటి నుండి పంట అమ్మి డబ్బులు అందేదాకా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నా వెంటనే డబ్బులిచ్చేవారు. కేంద్రాల్లో అమ్మి ఇబ్బంది పడుతున్నాం.