చివ్వెంల, జూన్ 09 : రైతులు నూతన వ్యవసాయ విధానంపై దృష్టి సాధించాలని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ గోబీనాథ్, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. సోమవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు రాపిడ్ మినీ సాయిల్ టెస్ట్ కిట్ ద్వారా మట్టిని పరీక్షించి పోషక లభ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు. పంట ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై రైతులు దృష్టి సారించాలన్నారు. రసాయన ఎరువులపై ఖర్చు తగ్గించి, సేంద్రియ వ్యవసాయం వైపునకు రైతులు మళ్లాలన్నారు. పంట మార్పిడి అవశ్యకతను వివరించి, వేసవి దుక్కులు వల్ల కలిగే లాభాలు, సమగ్ర వ్యవసాయ విధానాల ద్వారా పొందే అధిక దిగుబడులను వివరించారు.
కేవీకే నందు లభించే వివిధ కూరగాయలు, పండ్ల మొక్కల గురించి వివరించారు. వివిధ రకాల జీవన ఎరువులు వాడటం వల్ల ఉపయోగాలను తెలిపారు. ఎరువుల సమతుల్య వాడకం, చెరువు మట్టి తోలకం ఉపయోగాలు, పచ్చిరొట్టల పంట ఆవశ్యకత, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వివిధ పంటల్లో విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రధానంగా వరి, పత్తి విత్తన ఎంపికలో మెళకువలు, కొనుగోలు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. వరి సాగులో వెదజల్లే పద్ధతి ద్వారా పెట్టుబడిని తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ డి.వెంకటేశ్వర్లు, ఏఈఓలు ప్రియాంక, శైలజ, మానస, వెంకట్ రెడ్డి, రైతులు వెంకన్న, నరసింహ రెడ్డి, విష్ణువర్ధన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.